సినీ పరిశ్రమకు చంద్రబాబు గాలం
posted on Oct 12, 2015 3:54PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్న సినీ పరిశ్రమ కూడా ఏపీకి తరలిరావాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రం విడిపోయిన తరువాత సినీ పరిశ్రమ కూడా విడిపోతుందని అందరూ భావించినా అది జరగలేదు. ఎందుకంటే సినీ పరిశ్రమలో తెలంగాణకు సంబంధించ నటీ నటుల కంటే ఏపీకి సంబంధించిన వారే ఎక్కువగా ఉండటంతో ఇలాంటి సందేహాలు వచ్చాయి. కాకపోతే దానికి భిన్నంగా సినీ పరిశ్రమ విడిపోకుండా.. ఇక్కడ సకల సౌకర్యాలు ఉండటంతో మారే ప్రయత్నాలు చేయలేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు ఈ సినీ పరిశ్రమ ఏపీలోకి అడుగుపెట్టాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒక్కసారే కాకపోయినా.. నెమ్మదిగా సినీ పరిశ్రమలు వైజాగ్ లాంటి ప్రాంతాలకు తీసుకురావడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన భీమలి-విశాఖపట్నం రోడ్డులోని వజ్ర ఆశ్రమం దగ్గర ఫిలిం నగర్ కల్చరల్ సొసైటీ (ఎఫ్ ఎన్ సీసీ)కి ఆయన శంకుస్థాపన చేస్తున్నారు. దాదాపు 15 ఎకరాల్లో ఈ సొసైటీని డెవలప్ చేయబోతుండటం విశేషం. అయితే ఇప్పటికే వైజాగ్ లో రామానాయుడు స్టూడియోను నిర్మించినా అందులో పెద్దగా షూటింగ్ లు జరగడంలేదు. ఒక్కసారి ఇక్కడ షూటింగ్ లు ప్రారంభమైతే ఆటోమేటిక్ గా అందరూ వస్తారని.. మున్ముందు సినీ పరిశ్రమను వైజాగ్ కు రప్పించడానికి మరిన్ని చర్యలు చేపట్టనుంది ప్రభుత్వం. మొత్తానికి చంద్రబాబు సినీ పరిశ్రమకు గాలం వేసినట్టు తెలుస్తోంది. మరి చంద్రబాబు ప్లాన్ వర్కవుట్ అవుద్దా.. సినీ పరిశ్రమ ఏపీకి వస్తుందా..