దీక్షాద‌క్షుడైన‌ చంద్ర‌బాబు.. ప్ర‌భుత్వ ఉగ్ర‌వాదంపై పోరు..

టీడీపీ జాతీయ అధ్య‌క్షులు చంద్ర‌బాబునాయుడుది గాంధేయ‌మార్గం. త‌మ పార్టీ కార్యాల‌యాల‌పై వైసీపీ మూక‌ల దాడిని యావ‌త్ దేశం ముందు ఎండ‌గ‌ట్టేలా.. అధికార పార్టీని దోషిగా నిలిపేలా.. దీక్ష చేప‌ట్టారు. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యాన్ని వైసీపీ రౌడీలు ధ్వంసం చేయ‌గా.. ఆ శిథిలాల మ‌ధ్య‌లోనే దీక్షకు కూర్చొని ప్ర‌భుత్వంపై తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరుతో చంద్ర‌బాబు దీక్ష చేపట్టారు. ఈ ఉద‌యం 8 గంట‌ల‌కు దీక్ష ప్రారంభించారు. శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల వ‌ర‌కూ.. పార్టీ కార్యాలయంలో 36 గంటల దీక్ష కొనసాగనుంది. పగిలిన అద్దాలు, ధ్వంసమైన ఫర్నిచర్ మధ్యలోనే వేదికను ఏర్పాటు చేయ‌గా.. ఆ విధ్వంస ర‌చ‌న ఆన‌వాళ్ల మ‌ధ్యే 36 గంట‌ల నిర‌వ‌ధిక‌ దీక్ష చేస్తున్నారు చంద్ర‌బాబు.

చంద్ర‌బాబు చేప‌ట్టిన‌ దీక్షకు మద్దతుగా వివిధ జిల్లాల నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయానికి  పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరానున్నారు. దీక్షలో కోవిడ్ నిబంధనలు పాటించాలని పోలీసులు నోటీసులు అందజేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలకు పోలీసులు ఆటంకాలు సృష్టిస్తున్నార‌ని తెలుస్తోంది. 

ఇక‌, చంద్ర‌బాబు దీక్ష‌లో ఉండ‌గానే.. టీడీపీ నేత‌లు గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరి చందన్‌ను గురువారం సాయంత్రం కలవనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు గ‌వ‌ర్న‌ర్‌ అపాయింట్‌మెంట్ ఉంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ తదితరులు గవర్నర్‌ను క‌లిసి టీడీపీ కార్యాల‌యాల‌పై వైసీపీ శ్రేణుల దాడుల‌ను ఆయ‌న దృష్టికి తీసుకురానున్నారు. ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రించ‌నున్నారు.