జగన్ కేసులతో పోల్చితే కోడెల కేసులు చాలా చిన్నవి.. కానీ?

 

తన మిత్రుడు కోడెల మరణ వార్త తెలుసుకుని దిగ్భ్రాంతి చెందానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కోడెల పార్థివ దేహనికి నివాళులు అర్పించిన చంద్రబాబు.. అనంతరం మీడియాతో మాట్లాడారు.

కోడెలది ప్రభుత్వం చేసిన హత్య అని బాబు ఫైర్ అయ్యారు. మరే వ్యక్తికీ కోడెలలాంటి పరిస్థితి రాకూడదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి పోలీసులు, ఆలిండియా సర్వీస్‌ ఉద్యోగులు సరెండర్‌ అయ్యారని ఆరోపించారు. తప్పుచేసిన వాడికి శిక్ష వేస్తే నేనూ అభినందించేవాడినన్నారు. కుమారుడు, కూతురు వేధింపుల వల్లే.. కోడెల ఆత్మహత్య చేసుకున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాబు వాపోయారు. శివరాం విదేశాల్లో కాకుండా ఇక్కడే ఉండుంటే.. కోడెలను ఆయనే చంపాడని కేసులు పెట్టేవారని బాబు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఉన్మాదిలా వ్యవహరిస్తోందని.. కోడెల మృతిపై సీబీఐ విచారణ జరపాలని బాబు డిమాండ్ చేశారు.

కోడెలను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వేధించి చంపారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఓ సీనియర్‌ నేత ఆత్మహత్య చేసుకోవడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. కోడెలలాంటి వ్యక్తికి ఇలాంటి ముగింపు రావడం బాధాకరమన్నారు. కేసులు, వేధింపులతో కోడెల కుటుంబాన్ని చెల్లాచెదురుచేశారని.. కోడెల తప్పు చేసి చనిపోలేదు, వేధింపులకు గురై చనిపోయారని బాబు పేర్కొన్నారు. 

ఫర్నీచర్ విషయంలో తాను చాలా జాగ్రత్తగా ఉంటానని, ఏ ప్రభుత్వం వచ్చినా, సీనియర్లకు, ఉన్నత పదవుల్లో ఉన్నవారికి సామాగ్రిని సమకూర్చడం సర్వసాధారణమేనని అన్నారు. తన ఇంట్లోని ఫర్నిచర్‌ తీసుకెళ్లాలని.. అసెంబ్లీ కార్యదర్శికి కోడెల నాలుగు లేఖలు రాశారన్నారు. కానీ అసెంబ్లీ కార్యదర్శి కనీసం స్పందించలేదని చెప్పారు. రూ.43వేల కోట్లు దోచుకుని, 11 చార్జిషీట్లలో జగన్‌ ముద్దాయన్నారు. కేవలం రూ.లక్ష, రెండు లక్షలు విలువైన ఫర్నిచర్‌ విషయంలో.. కోడెలపై కేసులు పెట్టడం శోచనీయమన్నారు. కోడెలది ఇప్పటికీ కిరాయి ఇల్లేనని బాబు తెలిపారు.

"చిన్నచిన్న కేసుల పెట్టుకుని, ఓ వ్యక్తిని హెరాస్ చేసి, కుటుంబాన్ని చెల్లాచెదురు చేసి, కనీసం ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలియని పరిస్థితి తెచ్చి, సమాజంలో వీళ్లు ఏదో చేసేశారు. మొత్తం దోచేశారన్న ముద్ర వేసేసి.. మనిషి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చారు." అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.