తీన్మార్ మల్లన్న అరెస్టు

తీన్మార్ మల్లన్నను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వరంగల్‌లో భూ సమీకరణకు వ్యతిరేకంగాద ఆందోళనకు దిగిన రైతులకు మద్దతు తెలిపేందుకు వెళుతున్న మల్లన్నను వరంగల్ జిల్లా ఆరేపల్లి వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. వరంగల్‌లో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనకు మల్లన్న మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే శనివారం వారికి మద్దతు తెలియజేయడానికి అక్కడకు వెళుతున్న తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు. గతంలో కూడా వరంగల్ వెళుతున్న మల్లన్నను  పోలీసులు అరెస్టు చేసి లింగాల ఘనపురం పోలీసు స్టేషన్ కు తరలించిన సంగతి విదితమే.  లాండ్ పూలింగ్ ‘రియల్’ మాఫియాను అడ్డుకుంటున్న రైతులకు మద్దతుగా నిలుస్తున్నందుకే తనను అరెస్టు చేశారని అప్పట్లో మల్లన్న పేర్కొన్న సంగతి విదితమే.

గతంలో కేసీఆర్ విధానాలపై విమర్శలు గుప్పించిన తీన్మార్ మల్లన్న ఇటీవల తాను ఇకపై కేసీఆర్ పై విమర్శలు చేయబోనని ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే తాను త్వరలో బీజేపీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఆ సందర్భంగా బీజేపీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ పార్టీ కంటే తాను, తన బృందమే తెలంగాణ కోసం మెరుగ్గా పని చేయగలమని మల్లన్న పేర్కొన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయబోనని ప్రకటించడంతో తీన్మార్ మల్లన్నకు ఇక కేసుల బెడద తప్పుతుందని అప్పట్లో అంతా భావించారు. అయితే వరంగల్ లో ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకిస్తున్న రైతులకు మద్దతుగా మల్లన్న నిలబడటంతో రెండు వారాల వ్యవధిలో రెండో సారి అరెస్టు అయ్యారు.