కేసీఆర్ కు చంద్రబాబు సవాల్.. పోటీకి సిద్ధమా?

 

నెల్లూరులో టీడీపీ ఎన్నికల సన్నాహక సభలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీకి కార్యకర్తలే అసలైన బలమని.. తాను ఎప్పుడూ కార్యకర్తల మనిషినేనని, కార్యకర్తల త్యాగాలను గౌరవించే వ్యక్తినని చెప్పారు. వచ్చిపోయే నేతలతో టీడీపీ ఒరిగేదేమీ లేదన్నారు. స్వార్థం కోసం పార్టీ మారే నేతలకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. పట్టిసీమ ద్వారా శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని అందించామన్న బాబు.. గోదావరి-పెన్నా నదుల అనుసంధానికి  శ్రీకారం చుట్టామని చెప్పారు.  జిల్లాలో అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్న ఆయన.. జిల్లాలో అన్ని స్థానాల్లోనూ టీడీపీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ నుంచి ఫోన్లు వస్తే.. బీహార్ తెలివితేటలు ఏపీలో పనిచేయవని తిట్టాలని కార్యకర్తలతో అన్నారు. కుట్రలు, కుతంత్రాలు వైసీపీకి అలవాటేన్న బాబు.. వైఎస్‌ వివేకా హత్యను ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. ధైర్యముంటే ముగ్గురు మోదీలు కలిసి రావాలని.. తేల్చుకుందామని సవాల్ విసిరారు. ఏమీ చేయని కేసీఆర్‌ 88 సీట్లు గెలిస్తే.. అన్నీ చేసిన మనం 150 సీట్లు గెలవాలని చంద్రబాబు అన్నారు.
 
తాను మూడు వేల సార్లు తిట్టానని కేసీఆర్‌ ఆరోపిస్తున్నారని.. మరి ఆంధ్రులను కేసీఆర్‌ ఎన్ని లక్షల సార్లు తిట్టారని చంద్రబాబు అన్నారు. కేసీఆర్‌.. ఆంధ్రా బిర్యానీని పేడ అనలేదా? ఉలవచారును పశువులు తింటాయని అనలేదా? అని ప్రశ్నించారు. రాజకీయం కోసం ఏపీని వాడుకుంటారా? అంటూ చంద్రబాబు నిలదీశారు. తెలంగాణలో పార్టీలు లేకుండా చేస్తున్న కేసీఆర్‌.. ఇప్పుడు ఏపీపై దాడి ప్రారంభించారని విమర్శించారు. పార్టీకి చెందిన డేటాను పక్క రాష్ట్రం వ్యక్తులు చోరీ చేశారన్న బాబు.. కేసీఆర్‌కు దమ్ముంటే ఏపీకి వచ్చి తనపైన పోటీకి నిలబడాలని సవాల్‌ విసిరారు. కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పుతా అంటున్నారని, అసలు ఢిల్లీలో చక్రం ఉంటేగా.. కేసీఆర్‌ తిప్పడానికి అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. 25 ఎంపీ సీట్లు గెలిస్తే ఏపీకి న్యాయం ఎందుకు జరగదో చూద్దామని అన్నారు. అన్నీ పార్టీలను ఏకం చేసే శక్తి టీడీపీకే ఉందని చంద్రబాబు అన్నారు.