వైసీపీతో వెళ్లేదేంటి.. స్వయంగా టీడీపీ అవిశ్వాస తీర్మానం..

 

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక వైసీపీకి టీడీపీ కూడా మద్దతిచ్చిందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు టీడీపీ తన నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తోంది. కేవలం ఐదుగురు సభ్యులు సంతకాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలిచే బదులు, 16 మంది సభ్యుల బలమున్న తెలుగుదేశం పార్టీయే అవిశ్వాసం పెడితే మంచిదన్న అభిప్రాయాన్ని పార్టీ ఎంపీల ముందు చంద్రబాబు వ్యక్తం చేశారట. అవినీతిలో కూరుకుపోయిన వైకాపా వెంట వెళితే, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, అక్రమాస్తుల కేసులో కోర్టు చుట్టూ తిరిగే వ్యక్తి పార్టీ వెంట టీడీపీ వెళ్లకూడదని ప్రజలు కూడా భావిస్తున్నారని చంద్రబాబు అన్నారట.

 

ఇక ఈ నేపథ్యంలోనే చంద్రబాబునాయుడు ఆదేశించినట్టుగానే 16 మంది తెలుగుదేశం సభ్యుల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మాన నోటీసును టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత తోట నరసింహం లోక్ సభ కార్యదర్శికి అందించినట్టు సమాచారం. నోటీసులను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.