రాష్ట్రాన్ని గాలికొదిలేసిన కాంగ్రెస్

 

ఈ రోజు చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ “డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన 24గంటలలోనే డిల్లీలో రాష్ట్రపతి పాలన విదించిన కాంగ్రెస్ పార్టీ, కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి వారం రోజులయినా ఎందుకు పట్టించుకోవడం లేదు?” అని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని రాజ్యాంగ నిబంధనలని తుంగలో త్రొక్కి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంటే తెదేపా చూస్తూ కూర్చోదని ఆయన హెచ్చరించారు.

 

“ఎన్నికలు ముంచు కొస్తున్న ఈ తరుణంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే, అధికార దుర్వినియోగం చేసేందుకు వీలుపడదు గనుకనే, తనకు తగినంత మెజార్టీ లేకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ కాలయాపన చేస్తోందని” తేదేపాకు సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు.

 

డిల్లీలో తను అధికారంలోకి వచ్చే అవకాశం లేదు గనుకనే కాంగ్రెస్ పార్టీ వెంటనే రాష్ట్రపతి పాలన విదించింది. కానీ, ఇప్పుడు రాష్ట్రంపై రాష్ట్రపతి పాలన విదించాలంటే పార్లమెంటు ఆమోదం అవసరమనే సాంకేతిక కారణాన్ని సాకుగా చూపి కాంగ్రెస్ వారం రోజులుగా రాష్ట్రాన్నిగాలికొదిలేసింది. తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలనే శ్రద్ధ, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడంలో చూపించడం లేదు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ నుండి నిష్క్రమించడంతో ఆయనతో బాటు కొంతమంది పార్టీని వీడివెళ్లిపోయారు. మరి కొంతమంది కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీలలో చేరేందుకు తరలిపోయారు. అందువలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమయిన మెజార్టీ లేకపోవడంతో మద్దతు కోసం కొత్త మిత్రుడు కేసీఆర్ వైపు దీనంగా చూస్తోంది. అయితే ఆయన సోనియాగాంధీ తో కలిసి గ్రూప్ ఫోటోలు దిగారే తప్ప విలీనం, పొత్తుల సంగతి ఇంకా తేల్చేలేదు. ఆ సంగతి తేల్చకపోయినా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకి సిద్దపడితే దానికి మద్దతు ఇస్తారో లేదో అనే సంగతయినా తేల్చిచెప్పితేనే కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు గురించి ఆలోచన చేయగలదు. లేకుంటే అంతవరకు ముఖ్యమంత్రి అభ్యర్ధులని ఇంటర్వ్యూలు చేసుకొంటూ వారితో వార్ రూమ్ సమావేశాలు నిర్వహించుకొంటూ కాలక్షేపం చేయక తప్పదు. అంతవరకు ప్రజలు, చంద్రబాబు కూడా కొంచెం ఓపిక పట్టక తప్పదు మరి.