పరీక్షలు వేర్వేరుగా వద్దు
posted on Nov 15, 2014 10:37AM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఇంటర్ పరీక్షలకు వేర్వేరు షెడ్యూళ్లను శుక్రవారం సాయంత్రం ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. మార్చి 9నుంచి తెలంగాణలో, మార్చి 11 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఇంటర్మీడియట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించడానికి కలసిరావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆయన తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పరీక్షల షెడ్యూలుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పరీక్షల తేదీలను ముందుకు జరిపేందుకు కూడా సిద్ధమని ఆయన తెలిపారు. పరీక్షలను పదేళ్ళపాటు ఉమ్మడిగా నిర్వహించాలని విభజన చట్టంలో పేర్కొన్నారని, తెలంగాణ ప్రభుత్వం చట్టాలను ఎంతమాత్రం గౌరవించడం లేదని ఆయన అన్నారు. ఎంసెట్‌ని ఉమ్మడిగా నిర్వహిస్తూ ఇంటర్మీడియట్ పరీక్షలను వేరువేరుగా జరపాల్సిన అవసరం ఏమొచ్చిందని గంటా ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వ పంతం కారణంగా రెండు ప్రాంతాల్లో విద్యార్థులకు నష్టం జరుగుతుందని, తెలంగాణ ప్రభుత్వం పట్టుదల విడిచిపెట్టి ఉమ్మడిగా ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు సహకరించాలని గంటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.