డిల్లీలో చలసాని ప్రత్యేక పోరాటం, అరెస్ట్
posted on May 7, 2015 7:55AM
.jpg)
టాలివుడ్ నటుడు శివాజీ గుంటూరులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మొదలుపెట్టిన ఆమరణ నిరాహార దీక్షను నిన్న పోలీసులు భగ్నం చేసారు. ఆ వేడి ఇంకా తగ్గక మునుపే ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు నేతృత్వంలో ఏపీ విద్యార్థుల జేఏసీ, జన జాగృతి సంస్థ ప్రతినిధులు కలిసి డిల్లీ వెళ్లి ఏపీ భవన్ లో బస చేసి ఉన్న రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి, టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ లను కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇంకా ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. ఆ సందర్భంగా వారి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ప్రత్యేక హోదా కోసం తమ ప్రయత్నాలు తాము చేస్తూనే ఉన్నామని మంత్రులిరువురూ స్పష్టం చేసినప్పటికీ విద్యార్ధులు ఆందోళన విరమించలేదు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేసారు. అనంతరం వారు పార్లమెంటు వైపు బయలుదేరగా వారిని పోలీసులు అరెస్ట్ చేసారు.
దేశంలో ఏదయినా ఒక రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలనుకొంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దానికి తప్పనిసరిగా ఆమోదం తెలుపవలసి ఉంటుంది. కానీ ఇరుగు పొరుగు రాష్ట్రాలయిన తమిళనాడు, ఓడిశాలు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే తమ రాష్ట్రానికి రావలసిన పరిశ్రమలు, ఇప్పటికే ఉన్న పరిశ్రమలన్నీ అక్కడికి తరలిపోతాయని అందువల్ల ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వరాదని కేంద్రానికి లేఖలు వ్రాసాయి.
దేశంలోని 8 రాష్ట్రాలు అనేక ఏళ్ళుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాయి. ఒకవేళ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే ఆ తేనె తుట్టెను మళ్ళీ కదిపినట్లే అవుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనుకొంతున్నప్పటికీ జంకుతోంది. ఈ విషయాలన్నీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న వారందరికీ తెలుసు. కానీ రాష్ట్ర విభజన సమయంలో ఆ తరువాత ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చినందున ఇప్పుడు దాని కోసం పట్టుబడుతున్నాయి.