జగన్ బాటలో రాహుల్ ఓదార్పు యాత్ర
posted on May 7, 2015 7:22AM
.jpg)
జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తరువాత రాష్ట్రంలో తన పార్టీని బలోపేతం చేసుకొనేందుకు ఓదార్పు యాత్రలు చేసారు. తన తండ్రి మరణంతో ప్రజలలో ఏర్పడిన సానుభూతిని తనకు, తన పార్టీకి బదలాయించుకొనేందుకే ఆయన ఓదార్పు యాత్రలు చేసారనే సంగతి పెద్ద రహస్యమేమీ కాదు. అదేవిధంగా రాష్ట్ర విభజన తరువాత మళ్ళీ తెలంగాణాలో ప్రవేశించి తన పార్టీని బలోపేతం చేసుకొనేందుకు కూడా ఆయన అదే ఫార్ములాను నమ్ముకొన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకోవడానికి అదే ఫార్ములాను ఫాలో అయిపోతున్నారు.
రెండు నెలల పాటు విదేశాలలో సేద తీరిన రాహుల్ గాంధీ చాలా హుషారుగా పాదయాత్రలు చేస్తున్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో ఓడిపోయింది. కానీ ఆంధ్రా కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే దాని పరిస్థితి మెరుగుగానే ఉంది. కనుక ముందుగా దానిని బలోపేతం చేసుకొనే ప్రయత్నంలో రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకొన్న రైతులను పరామర్శించడానికి ఈనెల 11న హైదరాబాదులో దిగుతున్నారు. ఆ మరునాడు ఉదయం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో వడ్యాల నుండి 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి ఆత్మహత్యలు చేసుకొన్నా రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. రాచాపూర్, పొట్లపల్లి, లక్ష్మణ చాందా గ్రామాల మీదుగా ఆయన పాదయాత్ర చేసి సాయంత్రం 4 గంటలకు కొరటికల్ గ్రామంలో రైతులను ఉద్దేశించి మాట్లాడుతారు. ఆ తంతు ముగియగానే మళ్ళీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని రాత్రికి డిల్లీ వెళ్ళిపోతారు.
అయితే రాహుల్ గాంధీ మొక్కుబడిగా చేసే ఈ ఓదార్పుయాత్రతో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలపడిపోతుందనే భ్రమలు ఎవరికీ లేవు. కనుక ఆయన ఇలా ఎండల్లో పడి తనకు ఏమాత్రం అచ్చిరాని పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు చేయడం కంటే ముందుగా తన కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసుకొని, దానిపై పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తే ఏమయినా ప్రయోజనం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.