హోంగార్డ్.. చలాకీ చైన్ స్నాచర్
posted on Apr 13, 2015 11:20AM

చైన్ స్నాచింగ్ ఒక కళ. ఈ కళలో నిష్ణాతులైన చాలామంది మనకు కనిపిస్తూ వుంటారు. చిటికెలో మెడలోని నగలను తెంచుకుని వెళ్ళిపోతుంటారు. ఈ కళ మీద ఒక హోంగార్డ్‌కి మక్కువ కలిగింది. ఎవరెవరో చైన్ స్నాచింగ్ చేసి బాగుపడిపోతున్నారు.. నేను మాత్రం ఎందుకు బాగుపడకూడదు.. ఈ హోంగార్డ్ ఉద్యోగానికి వచ్చే జీతం ఏ మూలకి వస్తుందని అనుకున్నాడో ఏమోగానీ హైదరాబాద్‌లోని ఓ హోంగార్డు చైన్ స్నాచర్‌గా మారిపోయాడు. ఒకవైపు హోంగార్డుగా పనిచేస్తూనే, ఖాళీ సమయాల్లో సరదాగా చైన్ స్నాచింగ్ చేసుకుంటూ జీవితాన్ని వెళ్ళదీస్తున్నాడు. ప్రొఫెషనల్ చైన్ స్నాచర్ల కంటే బెటర్‌గా చైన్ స్నాచింగ్‌లు చేస్తున్న ఈయనగారి జాతకం తిరగబడి హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీసులకు దొరికిపోయాడు. ఇతగాడు దొరికిపోయిన తర్వాత అతను హోంగార్డు అని తెలుసుకుని పోలీసులు నోళ్ళు తెరిచారు. ఇతనితోపాటు అతనికి సహకరిస్తున్న ఒక మహిళను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరి దగ్గర్నుంచి పోలీసులు కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.