తాడేపల్లి ప్యాలెస్ డొంకలు కదులుతున్నాయా?

వివేకా హత్య కేసులో తాడేపల్లి ప్యాలెస్ డొంకలు కదులుతున్నాయా? అంటే సీబీఐ శుక్రవారం(మే26) తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ ఔననే అంటోంది. అవినాష్ సీబీఐ విచారణకు సహకరించకపోవడం, అరెస్టును తప్పించుకోవడానికి ఉన్న దారులన్నీ ఉపయోగించుకుంటూ.. చివరకు ఆ దారులన్నీ మూసుకుపోయిన తరువాత అనుచరులు, పోలీసులను అడ్డుపెట్టుకుని కర్నూలు విశ్వ భారతి ఆస్పత్రిలో షెల్టర్ పొంది.. ముందస్తు బెయిలు విచారణ వేకేషన్ బెంచ్ చేపట్టేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంను ఆశ్రయించడం తోలిపిందే. ఒక ఎంపి, అదీ అధికార పార్టీ ఎంపీ కేంద్ర దర్యాప్తు సంస్థను ఇలా ముప్పు తిప్పలు పెట్టడమేమిటన్న ఆనుమానాలు అందరిలో వ్యక్తమయ్యాయి. చివరకు తెలంగాణ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో ఈ అనుమానాలకు సమాధానాలు దొరికాయి. ఆ కౌంటర్ అఫిడవిట్ లో సీబీఐ జగన్ పేరు ప్రస్తావించింది. వివేకా హత్య గురించి జగన్ కు ప్రపంచానికి తెలియడం కంటే ముందే తెలుసునన్నది తమ అనుమానమని, ఆ విషయాన్ని అవినాష్ రెడ్డే ఆయనకు తెలిపాడని సీబీఐ పేర్కొంది. వివేకా హత్యను మందుగా చూసినట్లుగా చెబుతున్న ఎంవీ కృష్ణారెడ్డి ఆ విషయాన్ని బయటకు వెళ్లడించడానికి ముందే..   హత్య జరిగిందన్న విషయాన్ని అవినాష్ జగన్ కు చెప్పారా అనేది దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ తన అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొంది.   శుక్రవారం సీబీఐ తప వాదనలు వినిపించలేదు. అవినాష్ రెడ్డి, సునీత తరపు లాయర్లు వాదనల అనంతరం కోర్టు అవినాష్ ముందస్తు బెయిలు విచారణను శనివారం (మే 27)కు వాయిదా వేసింది. దీంతో శనివారం(మే27) సీబీఐ తరపు లాయర్లు వాదనలు వినిపించనున్నారు. ఈ సందర్భంగా వివేకా కేసులో జగన్ అంశంపై మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారుజామున నాలుగున్నర గంటలకే జగన్  హత్య గురించి.. తనతో పాటు సమావేశంలో ఉన్న వారికి చెప్పారన్న ప్రచారం జరిగింది. ఆ నలుగురిలో ఒకరైన మాజీ సీఎస్, ప్రభుత్వ సలహాదారు కల్లాం అజేయరెడ్డి ఇటీవల మీడియా సమావేశం పెట్టారు. తాను సీబీఐకి వాంగ్మూలం ఇచ్చానని వెల్లడించారు కూడా. అలాగే జగనే తమకు వివేకానందరెడ్డి చనిపోయారని చెప్పారని..అయితే గుండెపోటా కాదా అన్నది మాత్రం చెప్పలేదన్నారు. మరో వైపు ఉదయమే వివేకా హత్య గురించి బయట ప్రపంచానికి తెలియక ముందే అవినాష్ రెడ్డి .. జగన్‌, భారతి పీఏలకు ఫోన్లు చేసి.. మాట్లాడారని గుర్తించిన సీబీఐ గుర్తించి వారినీ విచారించింది. ప్రశ్నించింది. దీంతో శనివారం (మే 28) తెలంగాణ హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ విచారణలో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.

ఇలా ఉండగా  సీఎం జగన్మోహన్ రెడ్డి  ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇక  అవినాష్ రెడ్డి తన తల్లిని హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించి అక్కడే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి ముందు సీన్ హైదరాబాద్ ఆస్పత్రి ముందు రిపీట్ అవుతుందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.  ఇందుకూ కారణాలు లేకపోలేదు.

  వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా కడప ఎంపీ  అవినాష్ రెడ్డికి నోటీసులు ఇస్తే చాలు ఏపీ సీఎం జగన్ తన పర్యటనలను, కార్యక్రమాలను రద్దు చేసేసుకుంటారు. గతంలో   మూడుసార్లు అదే జరిగింది.  అందులో రెండు సార్లు ఆయన హుటాహుటిన హస్తిన బయలుదేరి వెళ్లారు. అలా వెళ్లిన ప్రతి సారీ సీబీఐ దర్యాప్తులో వేగం మందగించింది.  ఇక ఈ నెల 19 నుంచి అవినాష్ సీబీఐతో టామ్ అండ్ జెర్రీ ఆట ఆడుతున్నారు. మే 19న ఆయన సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉండగా తల్లి అనారోగ్యం కారణంతో విచారణకు డుమ్మా కొట్టారు. సరే మే 22న విచారణకు రావాలని సీబీఐ మరో సారి నోటీసులు ఇస్తే వాటినీ ఖాతరు చేయలేదు. సుప్రీం ను ఆశ్రయించి హైకోర్టులో పెండింగ్ లో ఉన్న తన ముందస్తు బెయిలు పిటిషన్ విచారణ పూర్తయ్యే వరకూ సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశించాలని కోరారు.

అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేయకుండానే.. ముందస్తు బెయిలు పిటిషన్ విచారించి ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా సుప్రీం కోర్టు తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ లోగా అవినాష్ సీబీఐకు రాసిన లేఖలో తల్లి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేననీ, మే 27 తరువాత ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానంటూ లేఖ రాశారు. ఆ లేఖే మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఎందుకంటే జగన్ ముందుగా శుక్రవారం( మే26) నుంచి మూడు రోజుల పాటు హస్తిన పర్యటనలో ఉంటారు. అంటే ఆయన హస్తిన పర్యటనకూ అవినాష్ సీబీఐ విచారణకు హాజరు కాకపోవడానికి లింకు ఉందని పరిశీలకులు గత సంఘటనలను ఉటంకిస్తూ విశ్లేషిస్తున్నారు. జగన్ ఏ కారణాలు చెప్పి హస్తిన వెళ్లినా.. ఆయన పర్యటన లక్ష్యం మాత్రం ఎలాగోలా సీబీఐ అరెస్టు నుంచి అవినాష్ ను బయటపడేయడమేనని పరిశీలకులు అంటున్నారు. ఆ పని  జగన్ చేసుకు వస్తారన్న ఆశతోనే మే 27 వరకూ విచారణకు హాజరు కాలేనని అవినాష్ సీబీఐకి లేఖ రాశారని అంటున్నారు.

తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేసి ఇంత కాలమైనా ఇప్పటి వరకూ ఆయనకు బెయిలు కోసం కనీసం దరఖాస్తు కూడా చేయని అవినాష్ రెడ్డి, జైలులో ఉన్న తండ్రిని ఒక్కసారి కూడా ములాఖత్ ద్వారా కలవని అవినాష్ రెడ్డి.. తన దాకా వచ్చే సరికి మాత్రం  బెంబేలెత్తిపోతున్నారు. జైలులో ఉన్న అవినాష్ రెడ్డి తండ్రి అస్వస్థతకు గురి కావడంతో ఆయనకు ఉస్మానియాలో చికిత్సకు శుక్రవారం (మే26) తీసుకువచ్చి తిరిగి జైలుకు తరలించారు. ఆ సందర్భంగా కూడా అవినాష్ కనీసం ఆయనకు చూడటానికి ఉస్మానియాకు వెళ్లలేదు. ఇవన్నీ చూస్తుంటే అవినాష్ జగన్ హస్తిన పర్యటనపై చాలా ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కానీ ఇప్పుడు సీబీఐ తన అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ లో స్వయంగా తన పేరే ప్రస్తావించడంతో జగన్  అవినాష్ ను కాపాడేందుకు ఢిల్లీ పెద్దల వద్ద ఒక వేళ ఏమైనా ప్రయత్నాలు చేసినా అవి ఫలిస్తాయా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి.