దినేష్ రెడ్డికి క్యాట్ లో మళ్ళీ ఎదురుదెబ్బ

 

డీజేపీ దినేష్ రెడ్డికి ఈ నెల 30వ తేదీతో పదవీకాలం ముగుస్తుంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆయన ఒకేసారి అనేక వివాదాలలో చిక్కుకొన్నారు. పైగా అతని ఆస్తులపై సీబీఐ విచారణ కూడా మొదలయింది. అందువల్ల ప్రభుత్వం అతని పదవీ కాలం పొడిగించేందుకు నిరాకరించడంతో ఆయన కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. కానీ అక్కడ కూడా ఆయనకు చుక్కెదురయింది. ట్రిబ్యునల్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్నే సమర్ధించడంతో ఆయన మళ్ళీ మరో ప్రత్యేక పిటిషను వేసారు. కానీ ట్రిబ్యునల్ ఆయన రెండో పిటిషన్నుకూడా ఈ రోజు తిరస్కరించింది.

 

ప్రభుత్వం ఆయన సమర్ధతను గుర్తించి, తనంతట తానుగా ఆయన పదవీ కాలం పొడిగించి ఉంటే అది ఆయనకు ఎంతో గౌరవ ప్రదంగా ఉండేది. కానీ సమస్యలు చుట్టుముట్టిన ఈ తరుణంలో తను అధికారంలో ఉండటం చాలా అవసరమని ఆయన భావిస్తున్నందునే ఆయన తన పదవిని కాపాడుకోవడానికి ఇంత పోరాటం చేస్తున్నారనిపిస్తుంది. ఇంకా కేవలం మూడు రోజులు మాత్రమే పదవీ కాలం మిగిలిన ఈ తరుణంలో ఆయన హుందాగా వ్యవహరించి తప్పుకొంటే బాగుంటుందేమో.