కిరణ్ సర్కార్ కి కౌంట్ డౌన్

 

అంటోనీ కమిటీ తో సంబంధం లేకుండా అక్టోబర్ మొదటి వారంలో తెలంగాణ నోట్ ని కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ప్రవేశపెడతామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ నిన్న ముహూర్తం ఖరారు చేసారు. ఇక అక్టోబర్ 3లోగా విభజన ప్రక్రియ మొదలుపెట్టకపోతే మళ్ళీ సకలజనుల సమ్మెకు దిగుతామని టీ-ఉద్యోగులు తాజాగా హెచ్చరికలు జారీ చేసారు. అదేవిధంగా టీ-నోట్ ను ముందుకు కదిపితే హైదరాబాదులో మిలియన్ మార్చ్ చేపడతామని ఏపీఎన్జీవోల నేత అశోక్ బాబు గతంలోనే హెచ్చరించారు. ఒకవేళ టీ-నోట్ పై ఏ మాత్రం అడుగు ముందుకు వేసినా వెంటనే తమ పదవులకు రాజీనామాలు చేస్తామని కొందరు సీమాంధ్ర యంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఒకే అంశంపై ఇన్నిప్రతిస్పందనలు వస్తున్నఈ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఇక దైర్యంగా ముందుకు సాగాలంటే బహుశః రాష్ట్రపతి పాలన ఒక్కటే శరణ్యం. తెలంగాణా నేతలు కూడా రాష్ట్రపతి పాలన విధించి విభజన ప్రక్రియను పూర్తి చేయమని గట్టిగా కోరుతున్నారు.

 

ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం టీ-నోట్ తయారు చేసి శాసనసభ ముందుకు పంపినా అది ఆమోదం పొందే అవకాశం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా సీమాంధ్ర నేతలందరూ కేవలం తెలంగాణా బిల్లును శాసనసభలో ఓడించేందుకే ఇంకా పదవులలో కొనసాగుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం టీ-నోట్ ను ముందుకు పంపి భంగపడే కంటే తనకున్న విచక్షణాధికారాలను ఉపయోగించుకొని దానిని నేరుగా పార్లమెంటులోనే ప్రవేశ పెట్టవచ్చును.

 

ఇక తన చేతికి మట్టి అంటకుండా జగన్మోహన్ రెడ్డి ద్వారా కిరణ్ కుమార్ రెడ్డిని, అతని ప్రభుత్వాన్నివదిలించుకొని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికే మొగ్గు చూపవచ్చును. ఈ లోగా అతని ద్వారానే ఏపీఎన్జీవోల సమ్మెను పక్కదారి పట్టించి దానిలో చీలికలు తీసుకువచ్చినిలిచిపోయెలా చేయవచ్చును. ఇప్పటికే జగన్ ఆ రెండు పనులలో కొంత ముందడుగు వేసారు. త్వరలోనే అతను మిగిలిన పని కూడా పూర్తి చేయగానే, రాష్ట్రపతి పాలన విధించి రాష్ట్ర విభజన ప్రక్రియను మొదలుపెట్టవచ్చును.అంటే దిగ్విజయ్ ప్రకటించిన అక్టోబర్ మొదటి వారమే కిరణ్ సర్కారుకి ఆఖరి వారం అయ్యే అవకాశున్నాయి.