వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి క్యాబినెట్ బెర్త్?
posted on Jul 14, 2025 11:02AM

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ఇటీవల అదే నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు నల్లపరెడ్డి ప్రశన్నకుమార్ రెడ్డి చేసిన దారుణ వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఈ విషయంలో కేసు కూడా నమోదైంది. అయితే ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ లేవు. అయితే.. రాజకీయాలతో సంబంధం లేకుండా సర్వత్రా నల్లపరెడ్డి ప్రసన్నకుమారరెడ్డి వ్యాఖ్యలపై ఖండనలు వెల్లువెత్తాయి. మహిళా నేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని సామాన్యజనం కూడా గర్హించారు. సరే ఈ వ్యాఖ్యల తరువాత ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై దాడి జరిగిందనుకోండి అది వేరే విషయం. నెల్లూరు జిల్లాపై వేమిరెడ్డి కుటుంబానికి మంచి పట్టుంది. అన్నిటికీ మించి ఎమ్మెల్యేగా ప్రశాంతి రెడ్డి ప్రజలలో మమేకమై సమస్యల పరిష్కారంలో, నియోజకవర్గ అభివృద్ధిలో దూసుకుపోతున్నారు.
కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి మంచి పేరుంది. ఎమ్మెల్యేగా ఆమె ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ప్రభుత్వ సహకారం కోసం వేచి చూడకుండా నియోజకవర్గంలో తన సొంత ఫౌండేషన్ నిధుల ద్వారా నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడం ద్వారా ఆమె ప్రజలలో మరీ ముఖ్యంగా మహిళలకు బాగా చేరువయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆమెకు ప్రజలలో పెరుగుతున్న పలుకుబడిని జీర్ణించుకోలేక, ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని జనం కూడా నమ్ముతున్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం కూటమి పార్టీల నేతలంతా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి సంఘీభావం ప్రకటించారు. ఆమెకు బాసటగా నిలిచారు. ఇప్పుడు ఆమెను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. త్వరలో చంద్రబాబు తన కేబినెట్ ను విస్తరించనున్నారు. ఈ విస్తరణలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి కేబినెట్ లో చోటు కల్పించడం ద్వారా తెలుగుదేశం మహిళలకు అండగా, బాసటగా నిలుస్తుందన్న సందేశం ఇచ్చినట్లుగా ఉంటుందని తెలుగుదేశం అధినాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.
అలాగే వేమిరెడ్డి కుటుంబానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మంచి పట్టు ఉంది. ఆమె భర్త, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి కూడా బలమైన నేత. ప్రజలలో మంచి పట్టున్న నాయకుడు. వాస్తవానికి గత ఏడాది ఎన్నికలలో తెలుగుదేశం కూటమి విజయం సాధించి చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన సమయంలోనే తన భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశించారు. అయితే అప్పుడు అది జరగలేదు. అయితే ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకోవడం ద్వారా వైసీపీకి గట్టి పట్టున్న కోవూరు నియోజరకవర్గంలో తెలుగుదేశం పార్టీని పటిష్టం చేయడానికి దోహదం చేస్తుందని తెలుగుదేశం అధినాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం విజయం సాధించి అధికారంలోకి వచ్చినప్పటికీ నెల్లూరు జిల్లాలో మాత్రం మొత్తం పది స్థానాలలో సైకిల్ పార్టీ కేవలం మూడు స్థానాలలో మాత్రమే విజయం సాధించింది. ఇక 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో కనీసం ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలవ లేకపోయింది. అయితే 2024 ఎన్నికలలో వైసీపీని కూటమి హవా జీరో స్థానాలకు పరిమితం కావడంలో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పాత్ర కీలకమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికలలో వైసీపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ, ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థుల విషయంతో తనను జగన్ విశ్వాసంలోకి తీసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తికి గురైన వేమిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరారు. ఈ చేరిక జిల్లా రాజకీయాలపై ప్రభావం చూపిందనీ, జిల్లాలో జగన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలడానికి కారణమైందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని తెలుగుదేశం కూటమి కేబినెట్ లోకి తీసుకోవడం జిల్లాలో వైసీపీ కోలుకోలేని విధంగా దెబ్బకొట్టినట్లు అవుతుందని భావిస్తున్నారు.