ఎవరి హవా వారిదే!

దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలు సోమవారం (జూన్ 23) వెలువడ్డాయి. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తై ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలలో ఏ పార్టీకీ నిరాశ మిగల్లేదు. అలాగని రొమ్ము విరుచుని ఆనందంతో గంతులేయడానికీ అద్భుత ఫలితాలూ రాలేదు. ఎవరి హవా వారిదే అన్నట్లుగా ఫలితాలు ఉన్నాయి.  గుజరాత్‌లోని విసావదర్, కడి స్థానాలతో పాటు పంజాబ్‌లోని లూథియానా వెస్ట్, పశ్చిమ బెంగాల్‌లోని కాళీగంజ్, కేరళలోని నీలాంబూరు నియోజకవర్గాలకు ఈ నెల  19న పోలింగ్ జరిగిన విషయం విదితమే. వెలువడిన ఫలితాలను బట్టి ఎవరి హవా వారిదే అన్నట్లుగా ఫలితాల సరళి ఉంది.  

కేరళలోని నీలాంబూరు స్థానంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్   అభ్యర్థి ఆర్యదన్ షౌకత్ విజయం సాధించారు.  ఇక పంజాబ్ లోని లూధియానా వెస్ట్ నియోజకవర్గాన్ని ఆప్ కైవశం చేసుకుంది. ఇక పశ్చిమ బెంగాల్ లోని కాళీగంజ్ స్థానానికి జరిగిన బై పోల్ లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక పోతే గుజరాత్ లోని విసావదర్ స్థానంలో ఆప్ అభ్యర్థి విజయం సాధిస్తే. కాడి సీటును బీజేపీ దక్కించుకుంది. మొత్తం ఐదు అసెంబ్లీ నియోజ కవర్గాలకు ఉప ఎన్నికలు జరగ్గా వాటిలో రెండింటిని ఆప్ దక్కించుకుంది. ఇక బీజేపీ, యూడీఎఫ్, టీఎంసీలు ఒక్కో స్థానంలో విజయం సాధించాయి.