ఫోన్ పే రచ్చ.. ఉచ్చు బిగుస్తోంది.. అయితే అరెస్టు అంత వీజీ కాదు!
posted on Jun 23, 2025 4:25PM
.webp)
ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, చివరకు ఏ కంచికి చేరుతుందో.. ఎప్పుడు ఎలా ముగుస్తుందో ఏమో కానీ.. ఇంతవరకు అందుతున్న సమాచారం ప్రకారం ముందు ముందు పెద్ద తలకాయలకు చిక్కులు తప్పవని అంటున్నారు. ముఖ్యంగా ఈకేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, తనను నియమించిన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతోనే పని చేశానని ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం గా మారింది. ప్రభాకర రావు స్టేట్మెంట్ ఆధారంగా ‘సిట్’ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ ను రికార్డు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే వ్యూహాత్మకంగా.. ఎప్పటికప్పడు స్టాండ్’ మారుస్తూ వస్తున్న ప్రభాకర రావు..సిట్ విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగానే, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని సీన్ లోకి తీసుకొచ్చారని, మాజీ ఐపీస్ అధికారి, బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్ సహా పలువురు మాజీ అధికారులు, పరిపాలన అనుభవం ఉన్న రాజకీయ నాయకులు భావిస్తున్నారు. నిజానికి.. ఇంటెల్జెన్సీ మరీ ముఖ్యంగా పొలిటికల్ ఇంటెల్జెన్సీకి సంబందించిన వ్యవహారాల్లో డీజీపీ, హోం శాఖ కార్యదర్శి, చివరకు హోం మంత్రి ప్రమేయం కూడా ఉండదని.. ఎస్‌ఐబీ చీఫ్ నేరుగా శాంతి భద్రతల శాఖ మంత్రి, అంటే ముఖ్యమంత్రికి (హోం మంత్రి ఎవరైనా శాంతి భద్రతల విభాగం ముఖ్యమంత్రి వద్ద ఉంచుకోవడం అన్నది అనాదిగా అన్ని రాష్ట్రాల్లో ఆచారంగా వస్తోంది. గత ప్రభుత్వ హయంలోనూ అదే ఆచారం కొనసాగింది. నాయని నరసింహ రెడ్డి, మహ్మూద్ అలీ ఎవరు హోం మంత్రిగా ఉన్నా, శాంతి భద్రలు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దనే ఉన్నాయి.) మాత్రమే రిపోర్ట్ చేస్తారని, ముఖ్యమంత్రి నుంచే, మౌఖిక, లిఖిత పూర్వక ఆదేశాలు స్వీకరిస్తారని అంటున్నారు.
సో.. ఇక్కడ ప్రభాకర రావు, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని సీన్ లోకి తీసుకు రావడం ఒక విధంగా కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నంగానే చూడాలని మాజీ అధకారులు అంటున్నారు. అయితే.. మరోవంక ప్రభాకర రావు ఇచ్చినట్లు చెపుతున్న స్టేట్మెంట్ మాజీ ముఖ్యమంత్రి, కేసీఆర్ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందని అంటున్నారు.
అదలాఉంటే, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావునను ఇప్పటికే ఐదుసార్లు విచారించిన సిట్ మరో సారి అంటే ఆరో సారి ఆదివాకం (జూన్ 23) విచారించింది. రెండు రోజుల క్రితం జరిగిన విచారణలో.. బంతిని మాజీ డీజీపీ కోర్టులోకి నెట్టిన ప్రభాకర రావు, ఈ సారి ఎలాంటి ప్రకటన చేస్తారు.. ఇంకెవరిని సీన్ లోకి తెస్తారు అన్న ఉత్కంఠ, ఆసక్తి వ్యక్తం అవుతున్నాయి. నిజానికి.. ప్రభాకర రావు విచారణకు పెద్దగా సహకరించడం లేదనీ.. ఎన్నిగంటలు కూర్చోపెట్టినా, ఒకటీ అరా ప్రశ్నలకు అరకొర సమాధానాలు ఇవ్వడమే కానీ, సరైన సమాధానలు ఇవ్వడం లేదని సిట్ వర్గాల సమాచారం. ముఖ్యంగా.. ఆగష్టు 5 వరకు ప్రభాకర రావును అరెస్ట్ చేయరాదని సుప్రీం కోర్టు ఆయనకు వెసులుబాటు కల్పించిన నేపధ్యంలో.. ఆయన విచారణకు సహకరించక పోయినా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని సిట్ వర్గాలు అంటున్నాయి.
అదలా ఉంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రులు, రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఒకరి తో ఒకరు తలపడిన కామారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ దేవరాజ్ గౌడ్ సహా, మరి కొందరు కాంగ్రెస్ నాయకులకు సిట్ వారం రోజుల్లోగా సిట్ కార్యాలయాని వచ్చి వాగ్మూలం ఇవాలని నోటీసులు ఇచ్చింది. అలాగే.. మరి కొంతమంది రాజకీయ నాయకుల స్టేట్మెంట్స్ కూడా సిట్ అధికారులు, రికార్డు చేయనున్నట్లు తెలుస్తోంది. అదలా ఉంటే.. ఈ కేసు ఏనాటికైనా లాజికల్ కంక్లూజన్ కు చేరుతుందా ? పెద్ద తలల అరెస్ట్ వరకు వెళుతుందా అంటే.. అది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పినంత ఈజీ అయితే కాదని అంటున్నారు.