బులెట్ ట్రైన్ ఒక వేస్ట్ ప్రాజెక్ట్: తెదేపా ఎంపి
posted on Dec 16, 2015 8:50AM
.jpg)
అమలాపురం లోక్ సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెదేపా ఎంపి పి. రవీంద్ర బాబు నిన్న కేంద్రప్రభుత్వానికి షాక్ ఇచ్చేరు. నిన్న లోక్ సభలో ఉప పద్దులపై జరిగిన చర్చలో మాట్లాడుతూ, “ప్రపంచదేశాలతో పోలిస్తే మన దేశ ఆర్ధిక పరిస్థితి ఏవిధంగా ఉందో అందరికీ తెలుసు. కనుక కేవలం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించేందుకు బులెట్ ట్రైన్ వంటి బారీ ప్రాజెక్టులను భుజాలకు ఎత్తుకోవడం సరికాదు. అసలు బులెట్ ట్రైన్ వంటి తలకు మించిన భారం ఎత్తుకోవడం దేనికి? మన దేశంలో 44 కోట్ల మందికి పైగా దారిద్ర్యరేఖకు దిగువనున్నారు. ఆ సొమ్మును వారి సంక్షేమానికి ఖర్చు చేస్తే బాగుంటుంది. ప్రభుత్వాలు తమ ప్రాధాన్యతలు ఏమిటో తెలుసుకొని అడుగు ముందుకు వేయవలసిన అవసరం ఉంది. మనం రక్షణ రంగం మీద ఖర్చు రెండు లక్షల కోట్లు చేస్తున్నాము. ఇరుగుపొరుగు దేశాలతో శాంతి నెలకొల్పుకొనగలిగితే, రక్షణ రంగం మీద ఖర్చు చేస్తున్న ఆ డబ్బు అంతా పేదల సంక్షేమానికి దేశాభివృద్ధికి వినియోగించుకోవచ్చును,” అని అన్నారు.
ఈ బులెట్ ట్రైన్ ప్రాజెక్టు ప్రధాని నరేంద్ర మోడి కలల ప్రాజెక్టు. కనుక దానిని బీజేపీలో, కేంద్రప్రభుత్వంలో, తెదేపాతో సహా ఎన్డీయే కూటమిలో ఎవరూ వ్యతిరేకించే సాహసం చేయడం లేదు. కానీ తెదేపా ఎంపీ రవీంద్ర బాబు నిష్కర్షగా తన అభిప్రాయం చెప్పగలగడం విశేషం. అయితే ఆయన ఒక్కరూ అభ్యంతరం చెప్పినంత మాత్రాన్న ఈ బులెట్ ట్రైన్ ప్రాజెక్టుపై కేంద్రం దానిని విరమించుకొంటుందని భావించలేము. కేంద్రప్రభుత్వం అహ్మదాబాద్-ముంబై మధ్య రూ. 98,000 కోట్లతో బులెట్ ట్రైన్ ప్రాజెక్టు నిర్మాణానికి జపాన్ తో ఒప్పందం కుదుర్చుకొంది. దానిలో 80 శాతం నిధులను జపాన్ సమకూర్చుతుంది. ఈ సందర్భంగా ఎంపీ రవీంద్ర బాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ, పోలవరం నిర్మాణం వంటి అంశాల గురించి కూడా కేంద్రప్రభుత్వాన్ని లోక్ సభలో నిలదీశారు.