ప్రమాదంలో బీఆర్ఎస్ ఉనికి?.. కారణమేంటంటే?

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఘోర పరాజయం బీఆర్ఎస్ శ్రేణుల నైతికస్థైర్యాన్ని పాతాళానికి పడిపోయేలా చేసింది. దీంతో రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదంలో పడింది. అయినా అసలు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు క్రీయాశీల రాజకీయాల నుంచి వెనకడుగు వేసి బాధ్యతలను తన కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు అప్పగించిన క్షణం నుంచీ రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పడిపోతూనే వస్తోందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. 

ఇక ఇప్పడు జూబ్లీ ఉప ఎన్నికలలో దాదాపు పాతిక వేల ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓటమి కేటీఆర్ వైఫల్యాల పరంపరకు పరాకాష్టగా చెబుతున్నారు. సరిగ్గా చెప్పాలంటూ.. గత అసెంబ్లీ ఎన్నికలో పార్టీ ఓటమి తరువాత కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమై..పార్టీ నడిపే బాధ్యతలను పూర్తిగా కేటీఆర్ కు అప్పగించిన తరువాత బీఆర్ఎస్ కు వరుసగా ఇది మూడో ఓటమి. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీఆర్ఎస్ రాష్ట్రంలోని 17 లోక్ సభస్థానాలలో పోటీ చేసిన పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. ఆ తరువాత కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇక ఇప్పుడు తాజాగా జూబ్లీ ఉప ఎన్నిక.. ఈ ఎన్నికలో కూడా బీఆర్ఎస్ పాతిక వేల ఓట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ హ్యాట్రిక్ పరాజయాలతో ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో అంతర్మథనం మొదలైంది. కేటీఆర్ నాయకత్వంలో ఒక్కటంటే ఒక్క విజయాన్ని కూడా నమోదు చేసుకోలేకపోవడంపై పార్టీలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జూబ్లీ ఓటమిపై పార్టీ నాయకులు ఎవేవో కారణాలు చెప్పవచ్చు.. తాము అధికారంలో ఉండగా అన్ని ఎన్నికలూ గెలిచామంటూ భుజాలు చరుచుకోవచ్చు.. కానీ ఓటమి ఓటమే... అందులోనూ గత అసెంబ్లీ ఎన్నికలలో తిరుగులేని విజయాలు సాధించిన గ్రేటర్ పరిధిలోనే వరుసగా రెండు ఉప ఎన్నికలలో ఓటమిపాలు కావడం కచ్చితంగా పార్టీకి తేరుకోలేని దెబ్బేననడంలో సందేహం లేదు. 

ఈ వరుస పరాజయాలు కేటీఆర్ నాయకత్వ పటిమపై సందేహాలకు తావిచ్చాయి. ఆయన నాయకత్వ సమర్థతపై పార్టీలోనే చర్చ మొదలైంది.  ఇక అధికార కాంగ్రెస్ అయితే ఇప్పటికే విఫల నేతగా కేటీఆర్ ను అభివర్ణిస్తూ విమర్శలు గుప్పిస్తున్నది.  ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే.. బీఆర్ఎస్ కు భవిష్యత్తే లేదంటున్నారు. కేసీఆర్ అనారోగ్యం, పార్టీని నడపలేక కేటీఆర్ సతమతం అందుకు కారణమని అంటున్నారు.  అయితే జూబ్లీ ఓటమిని కేటీఆర్ వైఫల్యంగా చెప్పలేం కానీ, నిస్సందేహంగా ఇదో పెద్ద ఎదురుదెబ్బ అని మాత్రం చెప్పుకోవాలి. అయితే  పదేళ్ల పాటు తిరుగులేకుండా అధికారాన్ని చెలాయించిన బీఆర్ఎస్ ఇప్పుడిలా కుదేలు కావడంలో తప్పెవరిది? కేసీఆర్ దా? కేటీఆర్ దా అన్న ప్రశ్న ఉత్పన్నమౌతోంది.

నిజానికి జరిగిందేమిటంటే.. పార్టీకి నిజంగా అవసరమున్న సమయంలో కేసీఆర్ క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. అందుకు కేసీఆర్ అనారోగ్యమే కారణమైతే అది పార్టీ దురదృష్టంగా భావించాల్సి ఉంటుంది. అయితే కేసీఆర్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అంగీకరించేందుకు అహం అడ్డువచ్చి కేసీఆర్ క్రీయాశీల రాజకీయాలకు దూరమై ఉంటే మాత్రం ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ సంక్షోభం కేసీఆర్ బాధ్యతగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు పార్టీ మళ్లీ పుంజుకోవాలంటే ఈ సంక్షోభ సమయంలో కేసీఆర్ కేటీఆర్ కు మార్గదర్శనం చేయాల్సి ఉంటుంది. అయితే అదే జరగడం లేదంటున్నాయి పార్టీ శ్రేణులు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu