మన్ కీ బాత్ లోనూ పహెల్గాం ఉగ్రదాడి ప్రస్తావన
posted on Apr 27, 2025 3:33PM

పెహల్గాం ఉగ్రదాడి తరువాత దేశ భద్రత అంశంపై ఏర్పాటు చేసిన అఖిలక్ష సమావేశానికి డుమ్మా కొట్టి మరీ బీహార్ పర్యటనకు వెళ్లి అక్కడ ఎన్నికల ప్రసంగం చేసి విమర్శలను ఎదుర్కొంటున్న ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం (ఏప్రిల్ 27) మన్ కీ బాత్ కార్యక్రమంలో పహెల్గాం ఉగ్రదాడి ప్రస్తావన తీసుకువచ్చారు. ప్రతి భారతీయుడూ ఈ దాడి పట్ల ఆగ్రహంతో రగిలిపోతున్నారని దాడికి పాల్పడిన ఏ ఉగ్రవాదినీ వదిలేది లేదని హెచ్చరించారు. ఉగ్రవాదం అంతానికి కంకణం కట్టుకున్నట్లు ఉద్ఘాటించారు.
పహెల్గాంలో ఉగ్రవాదులు తమ పిరికితనాన్ని ప్రదర్శించారని విమర్శలు గుప్పించారు. కాశ్మీర్ లో శాంతియుత వాతావరణం నెలకొనడం, అన్ని రంగాలలోనూ భారత్ అగ్రపథంలో దూసుకు వళ్లడం ఓర్చుకోలేని శత్రువులు దొంగదెబ్బ తీయడానికి చేసిన ప్రయత్నంగా పహల్గాం ఉగ్రదాడిని మోడీ అభివర్ణించారు. దాడి చేసిన ఉగ్రవాదులను వదిలిపెట్టబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం భారత్‌కు అండగా నిలిచిందని.. పహెల్గాం బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని భారోసా ఇచ్చారు.
ఈ ఉగ్రవాద దాడి చిత్రాలను చూసిన తర్వాత ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోందనీ.. కానీ పహెల్గాం దాడి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారి నిరాశను, డొల్లతనాన్ని, భయాన్ని ఎత్తి చూపిందని పేర్కొన్న మోడీ కాశ్మీర్ లో మళ్లీ పాతరోజులురావాలని కోరుకుంటున్న వారి ఆశ మాత్రం నెరవేరదన్నారు. ఉగ్రవాదంపై పోరులో దేశ ఐక్యత, 140 కోట్ల మంది భారతీయుల సంఘీభామే మనకున్న అతి పెద్ద ఆయుదమని చెప్పారు. కాశ్మీర్‌లో శాంతి తిరిగి వికసిస్తున్న సమయంలో జరిగిన ఈ దాడి కాశ్మీరీల్లో కూడా ఉగ్రవాదం పట్ల ఏహ్యతను పెంచిందనీ, ప్రజాస్వామ్య పునరుద్ధరణలో భాగస్వాములు కావాలన్న సంకల్పం కలిగించిందని మోడీ అన్నారు. ఉగ్రవాద నాయకులు కశ్మీర్‌ను మళ్లీ నాశనం చేయాలని కోరుకుంటున్నారు, కుట్రలు పన్నుతున్నారు. ఈ తరుణంలో మన సంకల్పాన్ని బలోపేతం చేసుకోవాలి. ఈ సవాలును దీటుగా ఎదుర్కోవాలి అని పిలుపునిచ్చారు.