టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు హైకోర్టులో చుక్కెదురు
posted on Dec 30, 2011 9:47AM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నేత, కరీంనగర్ జిల్లా వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్‍కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో గురువారం చుక్కెదురైంది. ద్వంద్వ పౌరసత్వం వ్యవహారంలో కేంద్రప్రభుత్వం ప్రారంభించిన విచారణ ప్రక్రియను నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఎత్తివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్, న్యాయమూర్తి జస్టిస్ పివి సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్‌గా జర్మనీలో స్థిరపడిన రమేష్ భారత ప్రభుత్వానికి ఏడాదికాలం ఇండియాలోనే ఉన్నట్లు తప్పుడు నివేదికలు సమర్పించి ఇక్కడి పౌరసత్వం పొందారని పేర్కొంటూ అది శ్రీనివాస్ అనే అతను కేంద్ర హోంశాఖకు 2009లో ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర హోంశాఖ ఎమ్మెల్యే రమేష్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తన పౌరసత్వంపై హోంశాఖ విచారణను నిలిపివేయించాలని కోరుతూ రమేష్ ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించారు. విచారణపై స్టే ఎత్తివేయాలని కోరుతూ ఆది శ్రీనివాస్ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు గతంలో విధించిన స్టేను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.