టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓటమి
posted on Mar 26, 2015 10:22AM

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజక వర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు విజయభేరీ మోగించారు. ఆయన మీద పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి, ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాదరావు చిత్తుగా ఓడిపోయారు. ఈయనపై బీజేపీ అభ్యర్థి 13,318 ఓట్ల మెజార్టీతో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సలహా మేరకు నీటిపారుదల శాఖలో తను చేస్తున్న ఉద్యోగానికి దేవీ ప్రసాద్ రాజీనామా చేసి మరీ ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ దేవీ ప్రసాద్‌కి పట్టభద్రుల నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు తేరుకోలేని షాక్ ఇచ్చారు. ఈ ఘోరమైన ఓటమి దేవీ ప్రసాదరావు కంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌కు పెద్ద దెబ్బ.