ఈటలకు కమలం హైకమాండ్ గ్రీన్ సిగ్నల్.. బండిలో భగ్గుమన్న అసంతృప్తి?
posted on Jan 24, 2025 11:10AM
.webp)
తెలంగాణ బీజేపీలో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ అధిష్ఠానానికి రాష్ట్ర పార్టీ నేతల మధ్య విభేదాలు, అంతర్గత కుమ్ములాటలు తలనొప్పిగా మారాయి. ఆ పంచాయతీ తీర్చలేకే గత కొద్ది కాలంగా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి ఎంపిక వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్ష రేసులో ఈటల ముందుండటం తొలి నుంచీ బీజేపీలో ఉన్న వారికీ, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నేతలకూ రుచించడం లేదు. దీంతో అధిష్ఠానానికి ఈటల వద్దంటూ పలు రిప్రజంటేషన్లు వెళ్లాయి.
మరీ ముఖ్యంగా రాష్ట్రంలో పార్టీ ఈ స్థాయిలో బలోపేతం కావడం వెనుక బండి శ్రమ ఉందని భావిస్తున్న బీజేపీ హై కమాండ్.. బండికి ఇష్టం లేకుండా ఈటలకు అధ్యక్ష పదవి కట్టబెట్టడం విషయంలో ముందు వెనుకలాడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధ్యక్ష పదవి రేసులోకి పలు పేర్లు వచ్చి చేరాయి. అయితే.. అధిష్ఠానం మొగ్గు మాత్రం ఈటల వైపే ఉందని తెలుస్తోంది. ఇందకు కారణాలు లేకపోలేదు. బలమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటలకు రాష్ట్ర రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉండటమే కాకుండా, తెలంగాణ సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. ఆయనకు బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టాలన్న బీజేపీ అధిష్ఠానం ఆకాంక్ష నెరవేరాలంటే ఈటల వంటి నేతకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించడమే మేలన్న భావన ఆ పార్టీ అగ్రనాయకత్వంలో వ్యక్తం అవుతోంది. అదే సమయంలో తొలి నుంచీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారు, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసే వారినీ దూరం చేసుకునే పరిస్థితి కూడా లేకపోవడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఓ పట్టాన నిర్ణయానికి రాలేక ఇంత కాలం సతమతమైన బీజేపీ హై కమాండ్.. ఇక ఇప్పుడు ఒక నిర్ణయం తీసేసుకుందని అంటున్నారు. ఇప్పటికే తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించేసిన బీజేపీ.. ఈటలకు పార్టీ పగ్గాలు అప్పగించేయడంతో పాటు బీసీలలో మరో బలమైన వర్గానికి చెందిన ఎంపి అర్వింద్ కుమార్ కు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే సొంత బలం సరిపోదని భావిస్తున్న బీజేపీ హైకమాండ్.. ఇందుకోసం అనివార్యంగా ఇతర పార్టీల నుంచి చేరికలు ఉండాలని కోరుకుంటోంది. అలా తన ఇన్ ఫ్లుయెన్స్ తో ఈటలపార్టీలోకి చేరికలను ప్రోత్సహించగలరనీ, తద్వారా గ్రామీణ స్థాయిలో కూడా పార్టీ బలోపేతం అయ్యేందుకు ఈటలకు అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర పార్టీలోని కీలక నేతలకు ఉప్పందిందని పరిశీలకులు అంటున్నారు. ఆ కారణంగానే కేంద్ర మంత్రి, ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ త్వరలో బీజేపీ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడు రాబోతున్నారని ప్రకటించడమే కాకుండా, మొదటి నుంచీ బీజేపీలో ఉన్నవారికే పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించాలన్న నియమమేదీ లేదని సెలవిచ్చారు. దాంతోనే ఈటలకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించడం ఖరారైందని పరిశీలకులు విశ్లేషణలు చేశారు.
తాజాగా తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తాను రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటానంటూ చేసిన వ్యాఖ్యలతో వారి విశ్లేషణలకు బలం చేకూరినట్లైంది. ఒకింత మనస్తాపానికి గురైనట్లు బండి తన వ్యాఖ్యల ద్వారా ఈటలకే పార్టీ రాష్ట్ర పగ్గాలు అందబోతున్నాయని పరోక్షంగా చెప్పేశారు. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి, రాజకీయాలలో ఇవన్నీ కామనే అన్న బండి సంజయ్ ఇక నుంచీ తాను రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటానని కుండబద్దలు కొట్టేశారు. బండి వ్యాఖ్యలతో బీజేపీ వర్గాలు కూడా ఈటలకే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అన్న నిర్ధారణకు వచ్చేశాయి. ప్రైవేటు సంభాషణల్లో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కూడా ఇదే చెబుతున్నారు.