ఫెడరల్ స్ఫూర్తికి కేంద్రం తూట్లు.. విద్యపై గుత్తాధిపత్యానికి కుట్ర?!
posted on Jan 24, 2025 10:29AM

రాష్ట్రాల నుంచి ఉన్నత విద్యను లాగేసుకోవడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నది. ఇందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ను అలంబన చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. వీసీల ఎంపిక, నియమకాలకు సంబంధించిన నిబంధనల సవరణకు యూజీసీ సమాయత్తమైంది. ఈ మేరకు ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. యూజీసీ ప్రస్తుత మార్గదర్శకాల మేరకు ప్రొఫెసర్‌గా కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉన్న విద్యావేత్తలు మాత్రమే వైస్ ఛాన్సలర్ పదవికి అర్హులౌతారు. అయితే కొత్త ప్రతిపాదన మేరకు పారిశ్రామిక రంగంలో లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో అదీ కాకపోతే పబ్లిక్ పాలసీ రంగంలో పదేళ్లకు పైగా అనుభవం ఉన్న వారిని కూడా వీసీల నియామకం విషయంలో పరిగణనలోనికి తీసుకునే అవకాశం ఉంటుంది. అనుభవం ఉన్న నిపుణులను కూడా పరిగణనలోకి తీసుకుంటామని యూజీసీ ప్రతిపాదించింది.
ఏ విధంగా చూసినా ఈ ప్రతిపాదన ఉన్నత విద్యలో రాష్ట్రాల హక్కులను, నిర్ణయాధికారాన్ని కాలరా స్తాయ నడంలో సందేహం లేదు. ఈ ప్రతిపాదనలు రాజ్యాంగ మూల సూత్రాలకు, ఫెడరల్ స్ఫూర్తికీ పూర్తిగా విరుద్ధం. ఈ కొత్త మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను, విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తికి భంగం కలిగిస్తాయి. ఈ కారణంగా యూజీసీ ప్రతిపాదనలను న్యూఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తెలంగాణ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నాన్ అకడమిక్ వీసీల నియామకం, రాష్ట్ర ప్రభుత్వాలకు వీసీలసెర్చ్ కమి టీలతో సంబంధం లేకుండా చేయడం వంటి ప్రతిపాదనలు నిజంగా ఆందోళనకరంగానే ఉన్నాయి.
చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థ అయిన యూజీసీని కేంద్రం తన సొంత ఎజెండా అమలుపరచేందుకు పావులా మార్చే ప్రయత్నమే ఇదన్న విమర్శలు విద్యాధికుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను కేంద్రం తన అధీనంలోకి తీసుకుంటూ రాష్ట్రాలపై తన విధానాలను బలవంతంగా రుద్దడానికి జరుగుతున్న కుట్రలా ఈ ప్రతిపాదనలను చూడాల్సి ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు, పౌర ప్రజా సంఘాలు, మేధావులు, రాష్ట్రాలలో అధికార, ప్రతిపక్ష ప్రభుత్వాలు తమ నిరసన తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.