విభిన్న పాత్రల్లో జీవించిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు!
on Jul 12, 2025
1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో సినీ నట జీవితాన్ని ప్రారంభించిన కోట శ్రీనివాసరావు.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినా అవి నటుడిగా ఎదిగేందుకు ఉపయోగపడలేదు. ఏడు సంవత్సరాల నిరీక్షణ తర్వాత 1985లో విడుదలైన వందేమాతరం, ప్రతిఘటన చిత్రాల్లో కోట పోషించిన పాత్రలతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. ముఖ్యంగా ప్రతిఘటనలో చేసిన మినిస్టర్ కాశయ్య క్యారెక్టర్‌కు విపరీతమైన పేరు వచ్చింది. తండ్రిగా, తాతగా, విలన్‌గా, కామెడీ విలన్‌గా, కమెడియన్‌గా.. ఇలా ఏ పాత్రనైనా తనదైన స్టైల్‌లో అద్భుతంగా పోషించి ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకున్న నటుడు కోట. ఒకప్పుడు కామెడీ విలన్ అంటే నాగభూషణం గుర్తొచ్చేవారు. ఆ స్థానాన్ని భర్తీ చేసి ఆ తరహా క్యారెక్టర్లలో సైతం మెప్పించారు కోట. ఇక అన్నిరకాల పాత్రలు పోషించడంలో ఎస్.వి.రంగారావు, రావుగోపాలరావు, కైకాల సత్యనారాయణ తర్వాత ఆ స్థానం కోట శ్రీనివాసరావుదే.
తను ఏ పాత్ర పోషించినా అది రెగ్యులర్ క్యారెక్టర్‌లా కాకుండా విభిన్నంగా ఉండాలనుకుంటారు కోట. డైరెక్టర్ చెప్పిన దాన్ని ఎంతో ఇంప్రవైజ్ చేసి ఆ క్యారెక్టర్లకు వన్నె తీసుకొచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఏ తరహా క్యారెక్టర్ అయినా దానికి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్, స్లాంగ్, ఏదో ఒక ఊతపదం జొప్పించి ప్రేక్షకులు నవ్వుల్లో మునిగిపోయేలా చేయడం కోటకు వెన్నతో పెట్టిన విద్య. ‘అందరికీ పెడతాండ దండం’, ‘ఈ ఫోనెవడు కనిపెట్టాడ్రా బాబూ..’, ‘థాంక్స్’, ‘నాకేంటి.. మరి నాకేంటి..’ వంటి డైలాగ్స్ జనం మధ్యలో ఇప్పటికీ మనకి వినిపిస్తూనే ఉంటాయి. కొన్ని మామూలు మాటల్ని కూడా తన విచిత్రమైన స్లాంగ్‌తో చెప్పి ప్రేక్షకుల్ని నవ్వించారు. ముఖ్యంగా తెలంగాణ స్లాంగ్‌లో ఆయన చెప్పిన రామాయణం ఒకప్పుడు క్యాసెట్ల రూపంలో విపరీతంగా పాపులర్ అయింది. ఆ తర్వాత రెండు, మూడు సినిమాల్లో కూడా దాన్ని వాడారు. అలాగే చాలా సినిమాల్లో తెలంగాణ స్లాంగ్‌లో చెప్పిన డైలాగ్స్‌కి మంచి పేరు వచ్చింది.
ప్రతిఘటనలో మినిస్టర్ కాశయ్యగా, అహనా పెళ్ళంటలో లక్ష్మీపతిగా ప్రేక్షకుల్ని మెప్పించిన కోట.. గణేశ్‌లో సాంబశివుడుగా, గాయంలో గురు నారాయణగా ప్రేక్షకుల్ని భయపెట్టారు. మనీ చిత్రంలో అల్లాదీన్‌గా, హలోబ్రదర్‌లో తాడి మట్టయ్యగా, మామగారు చిత్రంలో పోతురాజుగా ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్వించారు. మధ్య తరగతి తండ్రిగా, అల్లరి చేసే తాతగా, తాగుబోతుగా.. ఇలా ఏ పాత్ర చేసినా ఆ వేరియేషన్ చూపించడంలో కోట చాలా దిట్ట. సాధారణంగా తెలుగు సినిమాల్లో విలన్స్ కావాలంటే వెరైటీగా ఉంటుందని ఇతర భాషా నటుల్ని దిగుమతి చేసుకుంటూ ఉంటారు. కానీ, తెలుగు విలన్స్ ఇతర భాషల్లో నటించి పేరు తెచ్చుకోవడం అనేది చాలా చాలా అరుదు. కానీ, కోట శ్రీనివాసరావు ఆ ఘనత సాధించారు. తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో తన విలనీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. తమిళ్‌లోనే 30 సినిమాలు చేశారు. ఇప్పటివరకు ఏ తెలుగు విలన్ తమిళ్‌లో అన్ని సినిమాలు చెయ్యలేదు. 45 సంవత్సరాల తన సినీ కెరీర్‌లో 750కి పైగా సినిమాలు చేసి నటుడుగా తనదైన ముద్ర వేసిన కోట శ్రీనివాసరావు తను చేసిన క్యారెక్టర్లతో ఎప్పటికీ జీవించే ఉంటారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



