విరాళాలు 18 కోట్లు.. ఖర్చు 2 కోట్లు.. 20కోట్ల పన్ను ఎగవేసిన సోనూసూద్..
posted on Sep 18, 2021 1:45PM
చూసేదంతా నిజం..కాకపోవచ్చు. పైకి కనిపించేదంతా కరెక్ట్..కాకపోవచ్చు. ఎవరు మంచివాళ్లో, ఎవరు మంచివాళ్లలా నటిస్తున్నారో అంత ఈజీగా తేల్చలేం. కష్టాల్లో ఆదుకున్నోడు దేవుడు. ఆ కోణంలో కరోనా కష్టాల్లో దేవుడిలా అవతరించారు సోనూసూద్. అందుకే ఆయన్ను ఆపద్భాందవుడు అన్నారు వలస కూలీలు. ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న వారికి మెడిసిన్, ఆక్సిజన్ అందించి నేషన్ హీరో అయ్యారు సోనూసూద్. కొవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యాలను మూటగట్టుకోగా.. ఓ వ్యక్తిగా వ్యవస్థ చేయలేని సాయం చేసి చూపించారు సోనూసూద్. అందుకే, అలాంటి సూపర్ హీరోపై సడెన్‌గా ఐటీ రైడ్స్ అనగానే అంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రభుత్వంతో చేతులు కలపడం వల్లే సోనూను టార్గెట్ చేశారని మండిపడ్డారు. ఇదీ బీజేపీ ప్రతీకార చర్య అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, మూడు రోజుల ఐటీ సోదాల తర్వాత సోనూసూద్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి.
ప్రముఖ నటుడు సోనూసూద్ 20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. ఇటీవల ఐటీ అధికారులు ముంబై, లక్నోలోని సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. మూడురోజులు పాటు తనిఖీలు జరిపారు. పన్ను ఎగవేత ఆరోపణలతో.. ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. సోనూసూద్ ఫారిన్ కంట్రిబ్యూషన్ ( రెగ్యులేషన్) యాక్ట్‌ను ఉల్లంఘించారని ఐటీ అధికారులు తెలిపారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా విదేశీ దాతల నుంచి 2.1 కోట్లను సేకరించినట్టు గుర్తించారు. సోనూసూద్‌తో పాటు ఆయన సహచరుల కార్యాలయాల్లో కూడా పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలు లభించాయని ఐటీ శాఖ తెలిపింది.
కాగా, ఫస్ట్ వేవ్ సమయంలో సోనూసూద్ ఏర్పాటు చేసిన దాతృత్వ సంస్థ 18 కోట్లకు పైగా విరాళాలను సేకరించగా.. అందులో కేవలం 1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు ఖర్చు చేశారు. మిగతా డబ్బు అంతా ఆ సంస్థ ఖాతాలోనే ఉందని విషయం ఐటీ సోదాల్లో బయటపడటం కలకలం రేపుతోంది.