అదృశ్య నేతకే అధ్యక్ష పీఠం?!

భారతీయ జనతా పార్టీ కాబోయే జాతీయ అధ్యక్షుడు ఎవరు? ఈ ప్రశ్న జాతీయ రాజకీయాల్లోనే కాదు,రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రముఖంగా వినవస్తోంది. నిజానికి, బీజేపీ జాతీయ అధ్యక్షుల రేసులో  ఈ సారి ఉత్తారాది రాష్ట్రాల నేతలతో పాటుగా దక్షణాది రాష్ట్రాల నేతలూ పోటీ పడుతున్నారు. అందులోనూ తెలుగు రాష్ట్రాల నాయకుల పేర్లు మరింత ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అవును.  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వంటి  తెలుగు పేర్లు కూడా ఈ జాబితాలో ఉండడంతో  ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా బీజేపీ శ్రేణుల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది. 

నిజానికి  బీజేపీ దక్షణాది రాష్ట్రాలపై దుష్టి కేంద్రీకరించిందని  వార్తలు వస్తున్న నేపధ్యంలో  గత కొంత కాలంగా ఈ సారి బీజేపీ అధ్యక్ష పదవి దక్షిణాది రాష్ట్రాలకు దక్కుతుందనే కథనాలు ఇటు మీడియాలోనే కాదు, అటు పార్టీ వర్గాల్లోనూ వినిపిస్తున్నాయి. అలాగే ఈ సారి, సీనియర్లు ఎవరికీ చోటు ఉండదని  కొత్త తరానికి పగ్గాలు అప్పగించాలనే నిర్ణయం ఇప్పటికే జరిగిన నేపధ్యంలో, ఇంత వరకు జాతీయ స్థాయిలో పేరున్న  శివరాజ్ సింగ్ చౌవాన్ వంటి  నేతలకు అవకాశం ఉండక పోవచ్చని అనటున్నారు. అలాగే  దక్షణాది నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలనే ప్రతిపాదన కూడా బీజేపీ, సంఘ్ పరివార్ వర్గాల్లో వినవస్తోంది. ముఖ్యంగా విపక్ష ఇండియా కూటమి, కులగణన అంశంతో పాటుగా ఉత్తరాది, దక్షిణాది ప్రాంతీయ వాదాన్ని బలంగా తెరపైకి తెస్తున్న నేపద్యంలో, దక్షిణాది రాష్ట్రాల నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

నిజానికి బీజేపీ అధ్యక్ష పదవి దక్షిణాది రాష్ట్రాలకు దక్కి, రెండు దశాబ్దాలకు పైగానే అయింది. 2000 నుంచి 2004 లోక్ సభ ఎన్నికల వరకు బంగారు లక్ష్మణ్ ( తెలంగాణ), జానా కృష్ణ మూర్తి ( తమిళనాడు)  ఎం. వెంకయ్య నాయుడు ( ఆంధ్ర ప్రదేశ్) , ఒకరి వెంట ఒకరు పార్టీ అధ్యక్షులుగా కొనసాగారు.అంతే అంతకు ముందు  ఆ తర్వాత కూడా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎవరికీ బీజేపీ అధ్యక్ష పదవి దక్కలేదు. అదలా ఉంచితే ఇటీవల కాలంలో కమల దళం కన్ను దక్షిణాది రాష్ట్రాలపై పడింది. ముఖ్యంగా మోదీ, షా జోడీ వ్యూహాత్మక  పొత్తులు,ఎత్తులతో దక్షణాది రాష్ట్రాలలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది.  అయితే  ఇంత వరకు ఒక్క కర్ణాటక మినహా మిగిలిన దక్షణాది రాష్ట్రాలలో బీజేపీ, బలమైన ప్రత్యాన్మాయ స్థాయికి పార్టీ ఎదగ లేదు. అంతే కాదు, సమీప భవిష్యత్ లో  దక్షిణాదిన బీజేపీ పట్టు సాధించడం అయ్యే పని కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే   దక్షిణాది రాష్ట్రాలకు  పార్టీ పగ్గాలు అప్పగించిన సమయంలో పార్టీ ప్రస్థానం కుంటుపడిందనే అభిప్రాయం పార్టీ నేతల్లో లేకపోలేదు. సో .. మళ్ళీ మరోమారు  దక్షణాది రాష్ట్రాల నేతల చేతికి పగ్గాలు అప్పగించే విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచించ వలసి ఉంటుందని, అంటున్నారు.

ఏది ఏమైనా, బీజేపీ జాతీయ అధ్యక్షుని ఎంపికకు సంబంధించి ఇంతవరకు ఎంత కసరత్తు జరిగినా అంతమ నిర్ణయం మాత్రం ఇంత వరకు జరగలేదు.  ఈ నెల 21నుంచి బెంగుళూరులో మూడు రోజుల పాటు జరిగే, ఆర్ఎస్ఎస్  అఖిల భారత ప్రతినిధి సమావేశం తర్వాతనే  అంతిమ నిర్ణయం ఉంటుందని  తెలుస్తోంది. అదొకటి అలా ఉంటే, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలోనూ సదిగ్దత కొనసాగుతోంది. జాతీయ అధ్యక్షుడి ఎంపిక విషయంలోలానే, రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలోనూ అనేక పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఒక దశలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు పేరు ఇంచుమించుగా ఖరారు అయినట్లేనని  వినిపించినా, ఆ తర్వాత ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన రావు, పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే తాజాగా డీకే అరుణ, మురళీ ధర రావు పేర్లు వినిపిస్తున్నాయి.అయితే, పార్టీ నాయకత్వం దృష్టిలో అధ్యక్ష పదవి రేసులో ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, అనే విషయంలో ఇంతవరకు పార్టీ రాష్ట్ర నేతలు ఎవరికీ స్పష్టత లేదని అందుకే, ఎవరికి వారు సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు.

అదొకటి అయితే  ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపిక తీరును గమనిస్తే, పార్టీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక కూడా అదే విధంగా అనూహ్యంగా ఉన్నా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు.అవును,  అంతిమంగా ఎక్కడా కనిపించి, వినిపించని అదృశ్య నేత అధ్యక్ష పీఠం ఎక్కినా ఆశ్చర్య పోనవసరం లేదని, పార్టీ అతర్గత వర్గాల విశ్వసనీయ సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu