రాజాసింగ్ రాజీనామా!.. బీజేపీ ఎమ్మెల్యే సంచ‌ల‌నం..

తెలంగాణలో కొన్ని రోజులుగా ఓ నినాదం హోరెత్తుతోంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇప్పుడా నినాదం జోరుగా సాగుతోంది. మా ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటే.. మా ఎమ్మెల్యే చేయాలంటూ యావ‌త్ తెలంగాణ ప్ర‌జానికం గొంతెత్తి నిన‌దిస్తోంది. ఎమ్మెల్యే రాజీనామా చేయాలి.. త‌మ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక రావాలి.. ఇదే వారి ల‌క్ష్యం. ఎందుకో తెలుసా.. ఉప ఎన్నిక వ‌స్తేనైనా త‌మ ప్రాంతం అభివృద్ధి చెందుతుంద‌న్నదే వాళ్ల ఆశ‌. ఉప ఎన్నిక వ‌స్తేనైనా ద‌ళిత బంధు అమ‌ల‌వుతుంద‌నే అత్యాశ‌. ఉప ఎన్నిక వ‌స్తేనైనా కులాల వారీగా క‌మ్యూనిటీ హాళ్లు.. అంద‌రికీ డ‌బుల్ బెడ్‌రూమ్‌ ఇండ్లు.. అద్దాల్లాంటి రోడ్లు.. అంద‌మైన బ‌స్టాండ్లు.. సుంద‌ర‌మైన‌ పార్కులు.. అంద‌రికీ రేష‌న్ కార్డులు.. కొత్త పింఛ‌న్లు.. గ్రామానికి లక్ష‌లు.. మండలానికి కోట్లు అంటూ నిధులు వ‌ర‌ద పారుతుంద‌న్న నమ్మకం. 

మా ఎమ్మెల్యే రాజీనామా చేయాలనే నినాదం ప్రజా ప్రతినిధులకు తగులుతోంది. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు వెళుతున్నప్పుడు.. రాజీనామా చేయాలంటూ కొన్ని వర్గాలు ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్నాయి. మరికొందరు నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్యేలు ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళ్లడానికే జంకుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా దీన్నే ఆస్త్రంగా చేసుకుని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. రెండు వేల కోట్ల కేటాయిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవలే సంచలన ప్రకటన చేశారు. కోమటిరెడ్డి ప్రకటన అధికార పార్టీని ఇరుకున పడేసింది. 

తాజాగా  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని  ప్రకటించారు. గోషామహల్ అభివృద్ది కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని తన నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారని... వారి కోరిక మేరకు రాజీనామా చేస్తానని చెప్పారు. తన నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేసిన వెంటనే... అసెంబ్లీ స్పీకర్ ను కలిసి తన రాజీనామా లేఖను అందిస్తానని తెలిపారు.

ఉపఎన్నిక వస్తే కానీ బడుగులు, రైతులపై కేసీఆర్ కు ప్రేమ రావడం లేదని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలందరికీ రూ. 10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నిధులను విడుదల చేసిన వెంటనే స్పీకర్ కు తన రాజీనామా లేఖ ఇస్తానని చెప్పారు.