మల్కాజ్‌గిరిలో సత్తా చాటేది ఎవరు? ఓటరు ఎటు వైపు?

మల్కాజ్ గిరి పై పట్టుకోసం రాజకీయపార్టీలు హోరా హోరీగా త‌ల‌ప‌డుతున్నాయి.  ఇక్క‌డ మూడు పార్టీల మ‌ధ్య ఆసక్తికరమైన పోరు నెల‌కొంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో  దేశంలోని అన్ని రాష్ట్రాల, ప్రాంతాల ప్ర‌జ‌లు ఉంటారు. అందుకే మ‌ల్కాజ్ గిరి అంటే మినీ ఇండియాగా పేరుంది. పైగా దేశంలోని అతిపెద్ద లోక్ స‌భ సెగ్మెంట్ల‌లో కూడా మ‌ల్కాజ్ గిరి ఒక‌టి. సీఎం రేవంత్ రెడ్డి మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డి నుండే ప్రాతినిధ్యం వ‌హించారు. ఇప్పుడు  బీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ నేత‌లంతా ఫోక‌స్ చేస్తున్నారు. మ‌ల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థి రాగిడి ల‌క్ష్మారెడ్డి బ‌రిలో వున్నారు. ఇత‌నికి అండ‌గా మ‌ల్లారెడ్డి వున్నారు. 

మ‌ల్కాజ్ గిరి ప‌రిధిలోని మేడ్చ‌ల్, మ‌ల్కాజ్ గిరిలో మ‌ల్లారెడ్డి, ఆయ‌న అల్లుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరికి భారీ అనుచ‌ర‌గ‌ణం కూడా ఉండ‌గా, గ‌తంలో మ‌ల్కాజ్ గిరి నుండి మ‌ల్లారెడ్డి ఎంపీగా కూడా ప‌నిచేశారు.  మ‌ల్కాజ్‌గిరి ఎంపీ నియోజ‌క‌వ‌ర్గంలో ఏడుగురు ఎమ్మెల్యేలు మ‌న ద‌గ్గ‌ర్నే ఉన్నారు. 200 మందికి పైగా కార్పొరేట‌ర్లు కూడా బీఆర్ఎస్ కు చెందిన వారే ఉన్నారు.  ప‌దేండ్ల నిజానికి, వంద రోజుల అబ‌ద్దానికి, మ‌రో ప‌దేండ్ల విధ్వంస కేంద్ర పాల‌న‌కి  మ‌ధ్య యుద్దం అంటూ బీఆర్ ఎస్ ప్ర‌చారం చేస్తోంది.  ఈటెల‌కు, ప‌ట్నం సునీతాకు ఇంగ్లీషు, హిందీలో మాట్లాడ‌డం రాదు. వాళ్ళు పార్ల‌మెంట్‌కు వెళ్ళి ఏం మాట్లాడ‌తారాని బీఆర్ ఎస్ నిల‌దీస్తోంది.

అదే రాగిడి ల‌క్ష్మారెడ్డికి ఇంగ్లీష్, హిందీలో అద్భుతంగా మాట్లాడుతారు.. ప‌క్కా లోకల్ వ్య‌క్తి అయిన‌ అత‌ను మీ గొంతుక‌గా పార్ల‌మెంట్‌లో మాట్లాడుతారని బీఆర్ ఎస్ ప్ర‌చారం చేస్తోంది.  తెలంగాణ‌కు బీజేపీ ప్ర‌భుత్వం చేసిందేమీ లేదని చెప్పారు కేటీఆర్ ప‌దే ప‌దే చెబుతున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలకు ఎన్నో మెడిక‌ల్ కాలేజీలు ఇచ్చిన కేంద్రం, తెలంగాణకు మాత్రం గుండు సున్నా చుట్టిందని, కనీసం ఒక్క న‌వోద‌య పాఠ‌శాల కూడా ఇవ్వ‌లేదని, కొత్త‌గా ఒక్క విద్యాసంస్థ ఇవ్వ‌కుండా ప్ర‌ధాని కాల‌యాప‌న చేశారని అన్నారు.  

కాంగ్రెస్ నుండి ప‌ట్నం సునీతా మ‌హేంద‌ర్‌రెడ్డి పోటీ లో ఉన్నారు. మంత్రి తుమ్మ‌ల‌కు ఇక్క‌డ ఇంచార్జ్ ఇవ్వ‌టంతో గెలుపుపై కాంగ్రెస్ న‌మ్మ‌కంగా ఉంది.  సిట్టింగ్ సీటుపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. గ‌త ఎన్నిక‌ల్లో రేవంత్ రెడ్డి గెలుపొందిన నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో మల్కాజిగిరి సీటును కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా ఈ స్థానంలో విజయం సాధించడమే కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతోంది.  అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్ల‌మెంట్ ప‌రిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెల‌వ‌క పోవడం కొంచెం మైనస్. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా, ఇక్కడి ప్రజలు మాత్రం బీఆర్ఎస్ కు జై కొట్టారు. చేవెళ్ల నుంచి అనుకున్న అభ్యర్థిని, ఎందుకో మల్కాజిగిరిలో బరిలో దింపారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌రిగిన త‌ప్పిదాలు జ‌ర‌గ‌కుండా, విజ‌య‌కేత‌నం ఎగుర‌వేయాల‌ని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. తాము గెలిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి సాధ్యం అంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.

ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కూక‌ట్‌ప‌ల్లి, కుత్బుల్లాపూర్‌, మేడ్చల్‌, మ‌ల్కాజ్‌గిరి, ఉప్పల్‌, ఎల్బీన‌గ‌ర్, కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో అంత‌ర్భాగ‌మైన ఈ నియోజకవర్గాలు కీలక ప్రాంతాలు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 7 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మల్కాజిగిరి నియోజ‌క‌వ‌ర్గంలో దేశ ర‌క్షణ‌ రంగానికి చెందిన ఏయిర్ ఫోర్స్‌, ఆర్మీ స్థావరాలతో పాటు పారిశ్రామిక‌రంగం, విద్యారంగానికి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన యూనిర్శిటీలకు  కేరాఫ్ అడ్రస్‌గా ఉంది.  ఈ నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 38 ల‌క్షల ఓట‌ర్లు ఉన్నారు.  
 
నార్త్ ఇండియా నుండి ఎక్కువ మంది నివాస‌ముంటున్న సీటు కావ‌టంతో గెలుపు ఈజీ అవుతుంద‌న్న ఆశ‌ల్లో బీజేపీ నేత‌లు ఉన్నారు. ఇటీవ‌ల గ‌జ్వేల్, హుజురాబాద్ నుండి పోటీ చేసిన ఈట‌ల రాజేంద‌ర్  బీజేపీ అభ్య‌ర్థిగా ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు.  మ‌ల్కాజిగిరి ఎంపీ స్థానాన్ని నెగ్గాలని బీజేపీ సైతం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని వ్యూహాలు రచిస్తోంది. మోదీ ప్రధానిగా హ్యాట్రిక్ కొడతారని చెబుతూ పార్లమెంట్ స్థానాలను గెలిపించాలని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రధాని న‌రేంద్ర మోదీ ఇటీవల మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో రోడ్ షో సైతం నిర్వహించారు. మోదీ ప్రజాద‌ర‌ణ క‌లిసొస్తుంద‌ని అధిష్టానం ధీమాతో ఉంది. బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ వంటి బ‌ల‌మైన అభ్యర్థి బరిలో ఉన్నారు. ఒక్కసారి కూడా మ‌ల్కాజిగిరి సీటు నెగ్గకపోవడంతో తో ఈసారి ఖ‌చ్చితంగా సాధించాలని ప‌ట్టుద‌ల‌తో ఉంది.  ఈసారి మాత్రం మోదీ మేనియాతో నెగ్గాలని ప్లాన్ చేస్తోంది. సిట్టింగ్ సీటు కోసం కాంగ్రెస్ ఫోకస్ చేస్తుండగా, కనీసం ఒక్కసారైనా మల్కాజిగిరిపై తమ జెండా ఎగరేయాలని బీఆర్ఎస్, బీజేపీ భావిస్తున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరిలో బీజేపీకి మంచి ఓట్‌ బ్యాంక్‌ ఏర్పడింది. వ్యక్తిగతంగా తనకున్న ఇమేజ్‌, పార్టీ సపోర్ట్‌.. ఈ రెండు కలిసివచ్చే అంశాలు ఉన్నట్లు ఈటెల లెక్కలు వేసుకుంటున్నారట.  

తెలంగాణవాదుల్లో ఉదారవాదిగా ఉన్న ఈటల రాజేందర్ రెండు ప్రాంతాల ప్రజలు, గ్రేటర్ హైదరాబాద్‌లో కలిసిమెలిసి జీవించాలని కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 14 శాతం ఓట్లు, 8 సీట్లు సాధించడంలో కీలకమయ్యారు. ఈటల ప్రచారం నిర్వహించిన చోట్ల బీజేపీ అభ్యర్థులకు ఘననీయంగా ఓట్లు రావడం కూడా ఆయన పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్న క్రేజ్‌ను చాటుతోంది.  గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదాన్ని బీజేపీ తీసుకోడానికి ముఖ్య కారణం ఈటల అని గుర్తుంచుకోవాలి. ఈ లోకసభ ఎన్నికల్లో 10 స్థానాలు గెలుచుకోవాలని, 35 శాతం ఓట్లు రాబట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.   ఇక్క‌డ పోటీ  కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉండటం, దేశ వ్యాప్తంగా బీజేపీకి ఉన్న సానుకూలత కలిసి వస్తాయన్న అభిప్రాయం ఉంది. ఈటల రాజేందర్ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సన్నిహితంగా ఉండటం కూడా ఎన్నికల్లో కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. హైదరాబాద్‌లో మరీ ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో హిందుత్వం, బీజేపీకి అడ్వాంటేజ్ అన్న భావన ఉంది.

 - ఎం.కె.ఫ‌జ‌ల్‌