అలీ ఎక్కడ? కనిపించడేం?

జగమెరిగిన కమేడియన్ అలీ..  ఎలాగైనా సరే చట్టసభకు వెళ్లాలని తహతహలాడారు. అన్ని పార్టీలూ తిరిగి, అన్ని చర్చలూ జరిపి.. తనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకునేది ఒక్క వైసీపీ మాత్రమేనని నమ్మి గత ఎన్నికల ముందు ఆయన జగన్ ను నమ్ముకుని ఫ్యాన్ పార్టీ గూటికి చేరారు. ఆ క్రమంలో ఆయన సినీ పరిశ్రమలో  పవన్ కల్యాణ్ వంటి మిత్రుడిని దూరం చేసుకోవడానికి కూడా వెనుకాడలేదు. జనసేనానితో రాజకీయ ప్రవేశంపై అలీ చర్చించారు. అలీ జనసేన గూటికి చేరడం ఖాయమని కూడా అప్పట్లో అంతా భావించారు.

కానీ అక్కుంబుక్కుం అంటూ అలీ జగన్ పంచన చేరాడు. దీనిపై మనవాళ్లనుకున్న వారు, మన నుంచి సహాయం పొందిన వారూ కూడా మోసం చేశారని పవన్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు కూడా. అయితే అప్పట్లో అలీ పవన్ మాటలకు చాలా ఘాటుగా రిటార్డ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ గారూ!  మీ నుంచి నేనేం సహాయం పొందానో చెప్పాలి? డబ్బులిచ్చారా? పోనీ సినిమాల్లో వేషాలిచ్చారా? అని ప్రశ్నించి, తాను స్వయంకృషితో ఎదిగాననీ, ఎవరి నుంచీ సహాయం పొందలేదనీ చెప్పుకున్నారు అలీ. సరే అందతా వేరే విషయం. అలీ జగన్ గూటికి చేరారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న అలీకి 2019 ఎన్నికలలో పోటీకి అవకాశం ఇవ్వకుండా చేయిచ్చారు జగన్. అయితే మంచి పదవి ఇస్తానంటూ ఐదేళ్ల పాటు అలీని ఆశల పల్లకీలో ఊరేగించారు. మధ్యలో ఒకటి రెండు సార్లు జగన్ అలీని తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని మరీ పదవిపై హామీని పునరుద్ఘాటించారు.

ఆ రెండు సందర్భాలలోనూ సినీ పరిశ్రమ విషయంలో పంచాయతీ జరుగుతున్న సమయమే కావడం విశేషం.  సరే చివరికి ఆలీ ఆశించినంత పెద్ద పదవి కాకపోయినా.. కంటి తుడుపు చర్యగా ఓ సలహాదారు పదవి ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు జగన్. అయితే 2024 ఎన్నికలలో   అలీ పోటీ షూర్ అంటూ వైసీపీ నుంచి పలు లీకులు వచ్చాయి. ఆయన పోటీ చేసే నియోజకవర్గం కూడా తెరమీదకు వచ్చింది. తీరా జగన్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించాకా చూస్తే అలీ మళ్లీ కాట్రవల్లీయే అయిపోయారు.  ఇప్పటికి తత్వం బోధపడిందో ఏమో.. అలీ రాజకీయ యవనికపై ఎక్కడా కనిపించడం లేదు. వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొనడం లేదు. 

ఈ మధ్యే ఓ టీవీ చానల్ లో ఆయన నిర్వహించే అలీతో సరదాగా అన్న కార్యక్రమంలో నటుడు శివాజీని ఇంటర్వ్యూ చేశారు. ఆ సందర్భంగా శివాజీ అలీకి రాజకీయాల జోలికి మాత్రం పోకు. ఒక వేళ పోయినా ఎన్నికలలో పోటీ మాత్రం చేయకు అంటూ ఓ సలహా పారేశారు. చూస్తుంటే అలీ ఆ సలహాను తుచ తప్పకుండా పాటిస్తున్నట్లు కనిపిస్తోంది.