అంద‌రికీ వ్యాక్సినేష‌న్ పూర్తి.. రికార్డు సాధించిన తొలి సిటీ..

ఇండియాలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం న‌త్త‌న‌డ‌క‌గా సాగుతోంద‌నేది ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌. అభివృద్ధి చెందిన‌ దేశాల‌తో పోలిస్తే.. మ‌నం టీకా పంపిణీలో చాలా వెన‌క‌బ‌డి ఉన్నామ‌నే ఆరోప‌ణ‌. దేశ ప్ర‌జ‌లంద‌రికీ ఒక్క డోసు టీకా ఇవ్వ‌డానికే ఇంకా చాలా  నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌నే అంచ‌నా. ఇక రెండు డోసులు ఇచ్చి.. వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం పూర్తి చేయడం ఇప్ప‌ట్లో సాధ్యం కాక‌పోవ‌చ్చ‌నే నిరాశ. ఇలాంటి సంక్లిష్ట ప‌రిస్థితుల్లో దేశంలోకే కరోనా టీకా పంపిణీలో 100శాతం లక్ష్యాన్ని స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది ఓ న‌గ‌రం.

అదేమీ ఢిల్లీ, ముంబై, బెంగ‌ళూరులాంటి టాప్ సిటీ కాక‌పోవ‌చ్చు. అక్క‌డేమీ జ‌గ‌న్‌, కేసీఆర్‌లాంటి గొప్ప‌లు చెప్పుకునే ముఖ్య‌మంత్రి లేరు. తెలుగు రాష్ట్రాల‌కు ప‌క్క‌నే ఉన్నా.. ఆ స్టేట్ పేరుగానీ, ఆ సీఎం గురించి గానీ.. దేశంలో పెద్ద‌గా ప్ర‌స్తావ‌న‌కు రాదు. మ‌న సీఎంల మాదిరి ప్ర‌చార ఆర్బాటాల‌తో ఆయ‌న ఊద‌ర‌గొట్ట‌రు. సింపుల్‌గా త‌న ప‌ని తాను చేసుకుపోతారు. తాజాగా, వ్యాక్సినేష‌న్‌లో 100శాతం టార్గెట్ కంప్లీట్ చేసిన న‌గ‌రంగా ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్ రికార్డు సాధించింది. 
 
భువ‌నేశ్వ‌ర్‌లో 18 ఏళ్లు పైబడిన, అర్హులైన అందరికీ వ్యాక్సిన్‌ రెండు డోసులను అందించినట్లు భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. దేశంలో ఈ ఘనత సాధించిన తొలి నగరం ఇదేనని మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ అన్షుమన్‌ రథ్ ప్ర‌క‌టించారు. భువనేశ్వర్‌లో 18ఏళ్ల వయసు పైబడిన వారు దాదాపు 9లక్షల మంది ఉండగా.. ఇప్పటివరకు 18.16లక్షల మందికి టీకా డోసులు అందించారు. నగరంలో అర్హులైన 100శాతం మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు తెలిపారు. స్థానికుల‌తో పాటు వలస కూలీలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా టీకాలు ఇచ్చినట్లు తెలిపారు. నగరంలో 31వేల మంది ఆరోగ్య కార్యకర్తలు, 33వేల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 5.17లక్షల మంది 18 - 44 ఏళ్ల మధ్య వయస్కులు, 45ఏళ్లు పైబడిన 3.25లక్షల మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ అందించినట్లు తెలిపారు.   

టీకా పంపిణీలో లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని అన్షుమన్‌ వివరించారు. నగర వ్యాప్తంగా 55 వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజల సహకారంతో లక్ష్యాన్ని వేగవంతంగా పూర్తిచేశామ‌న్నారు. హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌, విశాఖ లాంటి న‌గ‌రాల్లో ప్ర‌హ‌స‌నంగా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం సాగుతుంటే.. ఆ ప‌క్క‌నే ఉన్న భువ‌నేశ్వ‌ర్‌లో మాత్రం వంద శాతం టీకా పంపిణీ పూర్త‌వ‌డం తెలుగురాష్ట్రాల‌కు సిగ్గు చేటు. స‌మ‌ర్థ‌వంత‌మైన ముఖ్య‌మంత్రి ఉంటేనే ఇలాంటి రికార్డులు సాధ్యం. అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.