జగన్ సర్కార్ దాదాగిరి చేస్తోంది.. కేసీఆర్ హాట్ కామెంట్స్ 

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జల వివాదం ఢిల్లీకి చేరింది. సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కృష్ణా రివర్డ్ బోర్డు మేనేజ్ మెంట్ ఆదేశాలను కూడా రెండు రాష్ట్రాలు పట్టించుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. తాజాగా జల జగడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియాలో నిర్వహించిన సభలో మాట్లాడిన కేసీఆర్..  కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల విషయంలో కేంద్రం, ఏపీ ప్ర‌భుత్వం అవ‌లంభిస్తున్న వైఖ‌రిపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్ర‌భుత్వం అవ‌లంభించే తెలంగాణ వ్య‌తిరేక వైఖ‌రి కావొచ్చు. ఆంధ్రా వాళ్లు చేస్తున్న దాదాగిరీ కావొచ్చు. కృష్ణా న‌దిపై ఏ విధంగా అక్ర‌మ ప్రాజెక్టులు క‌డుతున్నారో ప్ర‌జ‌లంద‌రూ చూస్తున్నారు. కృష్ణా నీళ్లలో రాబోయే రోజుల్లో మ‌న‌కు ఇబ్బంది జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌నం జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. 

రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కృష్ణా జలాల వివాదంపై చర్యలు చేపడుతామని చెప్పారు కేసీఆర్. దేవరకొండలో ఐదు లిఫ్టులు, మిర్యాలగూడలో ఐదు లిఫ్టులు, నకిరేకల్‌, హుజూర్‌నగర్‌లో ఒక్కొక్క లిఫ్ట్‌ ఇలా నల్గొండ జిల్లాలో మొత్తం 15 ఎత్తిపోతల పథకాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటన్నింటిని ఏడాదిన్నరలోపే పూర్తి చేసి తీరుతామని సభాముఖంగా ఆయన హామీ ఇచ్చారు. జల వివాదంపై కేంద్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించాల్సింది పోయి తెలంగాణ వ్యతిరేక వైఖరిని అవలంభిస్తోందని కేసీఆర్ ఆగ్రహించారు. 

నాగార్జున సాగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు కేటాయించారు సీఎం కేసీఆర్.  ఏడాదిన్నర లోపు అన్ని లిఫ్టులను పూర్తి చేస్తామన్నారు. దళితబంధు కోసం లక్ష కోట్లయినా ఖర్చు చేస్తామని చెప్పారు. 24 గంటల విద్యుత్‌ ఇస్తామంటే గతంలో జానారెడ్డి ఎగతాళి చేశారని.. రెండేళ్లు కాదు ఇరవై ఏళ్లయినా ఇవ్వలేరని అన్నారని కేసీఆర్ తెలిపారు. 24 గంటల విద్యుత్‌ ఇస్తే టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకుంటానని జానారెడ్డి అన్నారని.. కాని రెండేళ్లలో మేం 24 గంటల విద్యుత్‌ ఇచ్చామని చెప్పారు. జానారెడ్డి మాత్రం మాట తప్పి మొన్న కాంగ్రెస్‌ కండువా కప్పుకునే పోటీ చేశారని కేసీఆర్‌ విమర్శలు  కురిపించారు.