ఏంటీ ఓసీలకు కూడా రిజర్వేషన్లా వెంకటరమణా!?
posted on Oct 10, 2025 2:01PM

కామారెడ్డి నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి చిప్పు చెడిపోయిందేమో తెలీదుగానీ, ఓసీలకు కూడా రిజర్వేషన్ కావాలంటున్నారాయన. ఇప్పటికే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బీజేపీ మీదున్న అపవాదు అంతా ఇంతా కాదు. ఇప్పటికే ధర్మపురి అరవింద్ వంటి వారు తాజాగా చేసిన కామెంట్లు బీజేపీ మీద యాంటీ బీసీ ముద్ర వేస్తున్నాయి. అది చాలదన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణ తాజా వ్యాఖ్యలు మొదటికే మోసం తెచ్చేలా ఉన్నాయంటున్నారు పరిశీలకులు.
రిజర్వేషన్ల వ్యవహారంపై బీజేపీ కావాలని ఆడిస్తున్న డ్రామాగా ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. బీఆర్ఎస్.. బీసీలకు వ్యతిరేకంగా యాభై శాతం క్యాప్ చట్టం తేగా.. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయకపోవడం వెనుక బీజేపీ హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి వెళ్లి అక్కడ నిరసన వ్యక్తం చేసినా కూడా కేంద్రం స్పందన శూన్యం. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రంలోని బీజేపీయే అడ్డు పుల్ల వేస్తోందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఆ అనుమానాలకు తెలంగాణ బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మరింత బలం చేకూరుస్తున్నాయి. కామారెడ్డి ఎమ్మెల్యే అయితే ఓసీలకు కూడా రిజర్వేషన్లు కావాలంటూ చేసిన వ్యాఖ్యలతో అనుమానాలు కాదు.. వాస్తవమే అనిపిస్తోందని అంటున్నారు.
మొన్నటికి మొన్న కామారెడ్డికి వరద వచ్చినపుడు తాను ఇంటింటికీ వెళ్లి.. చాకిరీ చేయలేను కదా? అంటూ వ్యంగ్య వ్యాఖ్యానం చేసిన వెంకటరమణారెడ్డి.. మరోమారు తన వితండ వాదన వెలుగులోకి తేవడంతో.. ఈసారి ఎన్నికల్లో ఆ 8 సీట్లు కూడా ఊడిపోయేలా ఉన్నాయన్న హెచ్చరికలు అందుతున్నాయ్.
ఓబీసీలకు పదిశాతం రిజర్వేషన్లు ఇస్తే తామేమీ అడ్డుకోలేదని అంటారు వీహెచ్ వంటివారు. ఎందుకంటే వారిలో కూడా పేదలుంటారు కాబట్టి, తాము ఆటంకపరచలేదన్న కామెంట్ చేశారు వీహెచ్. 56 శాతం గా ఉన్న బీసీల ప్రయోజనాలను అడ్డుకునే విధంగా హైకోర్టు స్టే ఇవ్వడం వెనకున్న శక్తులు త్వరలోనే బయట పడతాయని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు, ఇతర బీసీ సంఘాల వారు.
ఇప్పటికే బీజేపీ మీదున్న నిందలు చాలవన్నట్టు వెంకటరమణారెడ్డి వంటి వారు బీజేపీని మరింత ఇరకాటంలో పడేస్తున్నారనీ.. ఇది విపరీత అర్ధాలకు దారి తీసి పార్టీని మరోమారు పుట్టి ముంచినా ఆశ్చర్యం లేదంటున్నారు కొందరు కాషాయ పార్టీ లీడర్లు. అనువుగాని చోట అధికులమనరాదన్న సామెతలు గుర్తు చేస్తున్నారు.