ఆ కాలమంతా ఆన్ డ్యూటీయే.. ఏబీవీకి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
posted on Jan 28, 2025 3:48PM
.webp)
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్ప శుభవార్త చెప్పింది. గతంలో చంద్రబాబు హయాంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావును ఆ తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందే. జగన్ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు రెండు సార్లు సస్పెండ్ అయ్యారు. మొదటి సారి 2020 ఫిబ్రవరి నుంచి రెండేళ్ల పాటు అంటే 2022 ఫిబ్రవరి వరకూ, ఆ తరువాత మళ్లీ జూన్ 22 నుంచి 2024 మే వరకూ ఆయనను జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది. సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత ఆయన తన సర్వీసు చివరి రోజున మళ్లీ డ్యూటీలో చేరారు.
సరే ఆ తరువాత గత ఏడాది జరిగిన ఎన్నికలలో జగన్ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువులోనికి వచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన ఏడు నెలల తరువాత ఏబీవీకి న్యాయం జరిగింది. జగన్ హయాంలో అన్యాయంగా సస్పెండ్ అయిన ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట కలిగించే నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఆయన సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఆయన సస్పెండైన కాలాన్ని ఆన్ డ్యూటీగా అంటే విధులు నిర్వర్తించినట్లుగా క్రమబద్ధీకరిస్తూ కూటమి సర్కార్ ఉత్తర్వ్యులు జారీ చేసింది. అలాగే ఆ సస్పెన్షన్ కాలానికి వేతనం అలవెన్సుల చెల్పింపునకు కూడా ఆదేశాలు జారీ చేసింది. సస్పెన్షన్ కాలం మొత్తాన్ని విధులు నిర్వర్తించినట్లుగానే పరిగణించి ఆయనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది.