మహాకుంభమేళాలో తొక్కిసలాట.. 15 మంది మృతి
posted on Jan 29, 2025 8:21AM
.webp)
మహాకుంభమేళాలో విషాదం సంభవించింది. బుధవారం తెల్లవారు జామున జరిగిన తొక్కిసలాటలో కనీసం 15 మంది మరణించారు. 70 మందికి పైగా గాయపడ్డారు. యూపీలోని ప్రయాగ్ రాజ్ నగరంలో జరుగుతున్న మహా కుంభమేళాకు మౌని అవామాస్య సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు అమృతస్నానాల కోసం తరలి వచ్చారు.
ఆ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 15 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం. 70 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మౌని అమావాస్య సందర్భంగా పది కోట్ల మందికి పైగా పవిత్ర స్నానమాచరించే అవకాశం ఉందన్న అంచనాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినప్పటికీ తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని వలంటీర్లు చెబుతున్నారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి.
కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 15 మంది మరణించడంపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన వివరాలను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు పోన్ చేసి తెలుసుకున్నారు. ఇలా ఉండగా తొక్కిసలాట నేపథ్యంలో 13 అఖాడాలు మౌని అమావాస్య అమృత స్నానాలను రద్దు చేశాయి. సంగమం వద్ద జన సమూహం ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అఖాడ పరిషత్ అధ్యక్షుడు రవీంద్ర పూరి తెలిపారు.