భద్రాచలంలో జరుగుతున్న అతిరాత్ర యాగం విశేషాలు
posted on May 1, 2012 3:41PM
వేదకాలంలో ప్రపంచానికి శక్తినిచ్చేది సూర్యుడని మన పూర్వీకులు బలంగా విశ్వసించారు. అటువంటి సూర్యదేవునికి భూమ్మీద ప్రతినిధిగా అగ్నిని భావిస్తారు. అందుకే ఏ యాగం చేసినా అగ్నిదేవునికి "స్వాహా" అంటూ ఆ యాగంలో భాగాన్ని సమర్పిస్తారు. మనం ఇక్కడ అగ్నికి సమర్పించేది సూర్యుడికి చేరుతుందని కూడా వారి ప్రగాఢ విశ్వాసం. ఆ విధంగా మన పూర్వీకులు యజ్ఞాలు, యాగాలు, క్రతువులూ లోక కళ్యాణార్థం జరిపించేవారు. ఈ యాగాలకు అయ్యే ఖర్చుని ఆ యా సమయాల్లో రాజ్యం ఏలుతున్న రాజులు భరించేవారు. తమ రాజ్యం సుభిష్టంగా, సస్యశ్యామలంగా ఉండాలనీ, ప్రజలంతా నీతివంతులుగా సుఖశాంతులతో మనుగడ సాగించాలనీ, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలూ జరుగకూడదనీ వారు ఇటువంటి అనేక యాగాలను నిర్వహించేవారు.
.jpg)
అటువంటి యాగాల్లో "అతిరాత్ర" యాగం ఒకటి...! ఈ అతియాత్ర యాగాన్ని21 ఏప్రిల్ నుండి 2 మే వరకు ఖమ్మం జిల్లాలోని భద్రాచల పుణ్యక్షేత్ర సమీపాన కల ఏటపాక లో కేరళ నుండి వచ్చి ఈ యాగాన్ని తన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు శ్రీ నంబూద్రి గారు. ఈ రోజు (01-05-2012) అతియాత్ర యాగంలో భాగంగా "పుత్రకామేష్టి "యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డి అక్కడ పూజల్లో పాల్గొన్నారు. ఈ రోజు ఈ యాగశాల చుట్టూతా గరుడపక్షులు ఆకాశంలో ప్రదక్షణలు చేయటం అక్కడకు విచ్చేసిన భక్తులు ప్రత్యక్షంగా వీక్షించారు. రేపటితో ఈ "అతిరాత్ర" యాగం మొదలై పన్నెండురోజులు పూర్తవుతుంది. ఈ "అతిరాత్ర" యాగం చేయటం వల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకూ ఎన్నో ప్రయోజనాలు ఒనగూడుతాయని యాగ నిర్వాహకులు శ్రీ నంబూద్రి గారు వివరించారు. ముఖ్యంగా, యాగము పూర్తయిన తర్వాత కుంభ వృష్టి కురుస్తుందని ప్రతీతి. ఇందుకోసమై పలువురు శాస్త్రవేత్తలు యాగము మొదలయిన దగ్గర నుండి యాగశాల వద్దే వుండి వివిధమైన శాస్త్రీయ పరీక్షలు జరుపుతున్నారు. ప్రస్తుతము రాష్ట్రం లో పడుతున్న చెదురుమదురు వానలు కూడా ఈ యాగం వల్లేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేసారు.
