కష్టసమయంలో కూడా నవ్వుతూ ఉండాలంటే ఇలా చేయండి!
posted on Jan 9, 2024 9:51AM
మనిషి జీవితానికి, కాలానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే రోజులో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రిలాగా.. మనిషి జీవితంలో కూడా సంతోషం, పోరాటం, కష్టం, దుఃఖం అన్నీ ఉంటాయి. వీటి నుండి విజయం, అపజయం అనే చీకటి, వెలుగులు దోబూచులాడతాయి. అయితే చాలా మందికి రెండింటిని ఒక్కటిగా తీసుకోవడం రాదు. కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు భయపడిపోవడం, అపజయం ఎదురైనప్పుడు కుంగిపోవడం చేస్తారు. విజయం సాధించినప్పుడు, అనుకున్నవి జరిగినప్పుడు సంతోషపడతారు. అయితే కష్టం వచ్చినా, సమస్యలు ఎదురైనా నవ్వుతూ ఉండాలంటే మాత్రం ఈ కింద చెప్పుకున్న పనులు పాటించాలి.
చాలామంది సంతోషాన్ని బయటి నుండి వెతుకుతారు. అయితే సంతోషం అనేది అంతర్గతమైనది. ఆనందం అనేది కేవలం పరిస్థితులు లేదా వ్యక్తి ద్వారా సృష్టించబడదని అర్థం చేసుకోవడం ముఖ్యం. అయితే దీన్ని కొన్ని పనులు చేయడం ద్వారా అనుభూతి చెందవచ్చు.
శారీరక శ్రమ..
శారీరక శ్రమ సహజంగానే మనిషి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అందుకే కనీసం 10 నిమిషాల వ్యాయామం చేయాలి. ఇందులో ఫాస్ట్ వాకింగ్, జంపింగ్ జాక్స్, స్ట్రెచింగ్ వంటివి చేర్చవచ్చు. అంతేకాకుండా మానసిక ఆరోగ్యానికి నాణ్యమైన నిద్ర కూడా చాలా ముఖ్యం. అందువల్ల ప్రతిరోజూ ఏడు గంటలు నిద్రపోవాలి. ముఖ్యంగా చాలా ఆందోళనగా ఉన్నప్పుడు సరైన నిద్ర చాలా అవసరం.
ప్రకృతికి దగ్గరగా..
గందరగోళంగా ఉన్న మనస్సును శాంతపరచడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం పచ్చని వాతావరణంలో నడవడం. దీని కోసం అడవులకు వెళ్లవలసిన అవసరం లేదు. పార్క్ లు, తోటలలో నడవడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకుపచ్చ రంగు మనసుకు విశ్రాంతినిస్తుంది. ఇది సంతోషాన్ని పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.
మిమ్మల్ని మీరు చూసుకుని నవ్వాలి..
ఎంత కష్టమైన సమయాలు ఉన్నా అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుని నవ్వడానికి ప్రయత్నించాలి. ఇది చాలా అద్భుతమైన ట్రిక్. దీన్ని అలవాటు చేసుకుంటే ఎంత క్లిష్టం పరిస్థితులలో ఉన్నా కూడా ఒత్తిడి, ఆందోళనకు గురి చేయనివ్వదు.
ఆలోచన..
కష్టకాలంలో ఉన్నప్పుడు దాన్ని గుర్తుచేసుకుని నిరంతరం ఆలోచించే బదులు దాని పరిష్కారం లేదా దాని ప్రభావం తగ్గించడం దిశగా ఆలోచించాలి. ఇలా చేయడం వల్ల మొదట మీరు డిప్రెషన్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు. రెండవది పరిస్థితిని మెరుగైన మార్గంలో ఎదుర్కోవడానికి మీ మనస్సు సిద్ధమవుతుంది.
*నిశ్శబ్ద.