పెరుగులో చియా సీడ్స్ నానబెట్టుకుని ప్రతి రోజూ తింటే ఏం జరుగుతుంది?
posted on Nov 19, 2025 2:20PM

ఆరోగ్యం మీద స్పృహ పెరిగిన నేటి కాలంలో ఆహారం విషయంలో చాలా ప్రాధాన్యతలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో చాలా రకాల ఆహారాల గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఆరోగ్య స్పృహ కారణంగా కొన్ని ఆహారాలకు ఆదరణ కూడా పెరుగుతోంది. చాలా మంది ఫాలో అవుతున్న అలాంటి ఆహారాలలో పెరుగులో నానబెట్టిన చియా సీడ్స్ తినడం కూడా ఒకటి. అసలు చియా సీడ్స్ ను పెరుగులో నానబెట్టి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఇది ఆరోగ్యానికి కలిగించే బెనిఫిట్స్ ఏంటి? తెలుసుకుంటే..
పెరుగు..
పెరుగు ప్రోబయోటిక్ అనే విషయం అందరికీ తెలిసిందే. కాల్షియం, హై క్వాలిటీ ప్రోటీన్లు పెరుగులో చాలా మెరుగ్గా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను, ఎముకలను బలోపేతం చేస్తాయి.
చియా గింజలు..
చియా గింజలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. అవి రోగనిరోధక శక్తిని పెంచి, ఎముకలను బలోపేతం చేసి, గుండె ఆరోగ్యానికి సపోర్ట్ చేసే ఔషదంగా పనిచేస్తాయి.
పెరుగు, చియా కాంబినేషన్..
కండరాలను బలోపేతం చేసుకోవాలనుకునే వారికి లేదా జీర్ణ సమస్యలతో బాధపడేవారికి పెరుగు, చియా విత్తనాల కాంబినేషన్ ప్రయోజనకరంగా ఉంటుంది.
పెరుగు, చియా కాంబినేషన్ బెనిఫిట్స్..
పెరుగు ఎముక సాంద్రతను కాపాడుకోవడానికి అవసరమైన కాల్షియం, విటమిన్ డి కి అద్భుతమైన మూలం. చియా గింజలు మెగ్నీషియం, భాస్వరంను జోడిస్తాయి. ఈ పోషకాల కలయిక ఎముక బలానికి చాలా సహాయపడుతుంది.
చియా గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు (ముఖ్యంగా ALA) పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. అవి చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడంలో, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
పెరుగులోని ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మలబద్ధకాన్ని తగ్గిస్తాయి, పోషకాల శోషణను మెరుగుపరుస్తాయి. చియా విత్తనాలలోని ఫైబర్ జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. పేగు ఆరోగ్యం బలంగా ఉంటే రోగనిరోధక వ్యవస్థ కూడా బలంగా ఉంటుంది.
పెరుగులోని ప్రోటీన్, చియా విత్తనాలలోని ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తాయి. ఆకలి బాధలను నివారిస్తాయి. ఈ రెండింటి కాంబినేషన్ తీసుకోవడం వల్ల ఎక్కువసేపు, నెమ్మదిగా శక్తి విడుదల అవుతుంది. ఇది టైప్-2 డయాబెటిస్, బరువు కంట్రోల్ ఉండటం వంటి వాటికి సహాయపడుతుంది.
*రూపశ్రీ.