అధికారుల అత్యుత్సాహం.. డోర్ల‌కు ఇనుప‌ రేకులు పెట్టి మేకులు కొట్టారు

క‌రోనా నియంత్ర‌ణ పేరుతో బెంగ‌ళూరులో అధికారులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. క‌రోనా సోకిన వారుండే ప్ర‌దేశాల‌ను అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్ర‌క‌టించి జ‌న‌సంచారాన్ని క‌ట్ట‌డి చేయ‌డం చూస్తున్నాం. అయితే, బెంగ‌ళూరు మ‌హాన‌గ‌ర పాలిక సిబ్బంది మాత్రం బాధితుల‌పై క‌క్ష‌గట్టిన‌ట్టు ప్రవర్తించారు.

క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ వారు ఉన్నార‌నే కార‌ణంతో ఓ బిల్డింగ్‌ లో ఉన్న ఇళ్ల డోర్ల‌న్నింటికీ ఇనుప రేకులు అడ్డుగా పెట్టి మేకులు కొట్టారు. దీంతో ఆ బిల్డింగ్‌లో ఉన్న‌ కుటుంబాలు ఆందోళ‌న చెందాయి. ఇళ్ల‌ల్లో చిన్న‌పిల్ల‌లు, వృద్ధులు ఉన్నారు.. ఏదైనా అత్య‌వ‌స‌రం అయితే అప్ప‌టిక‌ప్పుడు వారిని ఆస్ప‌త్రికి ఎలా త‌ర‌లించాల‌ని ఆవేదన వ్యక్తం చేశారు. పొరపాటున అగ్ని ప్రమాదం లాంటివి సంభవిస్తే పరిస్థితి ఏంటని, దీనిపై అధికారులు వెంట‌నే  స్పందించాలంటూ ఆ బిల్డింగ్‌లో ఉండే ఓ వ్య‌క్తి ట్వీట్ చేశాడు. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

కాగా, ఈ ఘ‌ట‌న‌పై బెంగ‌ళూరు మ‌హాన‌గ‌ర పాలిక క‌మిష‌న‌ర్ ఎన్ మంజునాథ ప్ర‌సాద్ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. క‌రోనా బాధితుల ఇళ్ల త‌లుపుల‌కు అడ్డంగా పెట్టిన రేకులను వెంట‌నే తొల‌గించాల‌ని సిబ్బందిని ఆదేశించిన‌ట్టు తెలిపారు. వైర‌స్ సోకిన వారిని కాపాడ‌టం, సోక‌ని వారిని సేఫ్‌ గా ఉంచే ఉద్దేశ్యంతోనే త‌మ సిబ్బంది అలా చేసార‌ని చెప్పుకొచ్చారు. బాధితులంద‌రిని తాము ఒకే ర‌కంగా గౌర‌విస్తామ‌ని స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu