పవన్ తో బాలినేని భేటీ ఎందుకంటే?
posted on Jan 24, 2025 3:25PM
.webp)
ప్రకాశం జిల్లాలో వైసీపీ అడ్రస్ గల్లంతైపోనుందా? ఆ పార్టీ జెండా కూడా ఇకపై కనిపించే అవకాశం లేదా? అంటే ఔనన్న సమాధానమే వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు. వైసీపీ అధినేత జగన్ కు బంధువైన బాలినేని జగన్ అధికారంలో ఉన్నంత కాలం వైసీపీలోనే ఉన్నారు. వాస్తవానికి జగన్ సొంతంగా వైసీపీ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు కాంగ్రెస్ ను వీడి బాలినేని కూడా జగన్ తో అడుగు కలిపి నడిచారు. అంత వరకూ బాగానే ఉంది. ఎప్పుడైతే జగన్ అధకారంలోకి వచ్చిన మూడేళ్లకు తన మంత్రివర్గాన్ని విస్తరించారో.. అప్పటి నుంచే బాలినేనిలో అసంతృప్తి మొలకెత్తింది.
ఎందుకంటే 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కేబినెట్ లో బాలినేనికి చోటు ఇచ్చారు. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బాలినేని మంత్రి పదవిని పీకేశారు. అదే సమయంలో అదే జిల్లాకు అంటే ప్రకాశం జిల్లాకు చెందిన మరో మంత్రిని మాత్రం కొనసాగించారు. ఇది సహజంగానే బాలినేనిలో అసంతృప్తికి, అసమ్మతికి కారణమైంది. అప్పటి నుంచీ బాలినేని వైసీపీలో కొనసాగినా, సొంత పార్టీలోనే అసమ్మతి వాదిగా మిగిలిపోయారు. జగన్ పొమ్మనకపోయినా, బాలినేనికి పార్టీలో అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. మెడపట్టి గెంటినా చూరుపట్టుకు వేళాడిన చందంగా ఆయన వైసీపీలో కొనసాగారు. ఇక 2024 ఎన్నికలకు ముందు బాలినేనికి ఒంగోలు అసెంబ్లీ టికెట్ వస్తుందా? అన్న అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి. ఎలాగోలా టికెట్ సంపాదించుకున్నప్పటికీ ఆ ఎన్నికలలో బాలినేని పరాజయం పాలయ్యారు. ఆ తరువాత ఆయన తన ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగే కారణమంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. అయితే తన ఫిర్యాదుకు పార్టీ నుంచి ఎటువంటి మద్దతూ రాకపోవడంతో ఆయన ఇక లాభం లేదనుకుని జనసేన గూటికి చేరారు.
ఆర్భాటంగా జనసేన ఎంట్రీ కోసం బాలినేని తహతహలాడినప్పటికీ జనసేనాని పవన్ కల్యాణ్ అందుకు అంగీకరించలేదు. ఒంగోలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, దానికి పవన్ ను ఆహ్వానించి తన అనుచరులతో భారీగా కార్యక్రమం నిర్వహించాలని భావించిన బాలినేనికి పవన్ కల్యాణ్ చెక్ పెట్టారు. ఒంటరిగా మంగళగిరి జనసేన కార్యాలయానికి వచ్చి పార్టీ కండువా కప్పుకుని వచ్చామా.. చేరామా అన్నట్లుగా కార్యక్రమాన్ని ముగించాలన్న పవన్ ఆదేశాల మేరకు బాలినేని అతి నిరాడంబరంగా జనసేన గూటికి చేరారు.
ఇక ఇప్పుడు బాలినేనికి అవకాశం వచ్చింది. బాలినేని మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ తో గురువారం (జనవరి 23) భేటీ అయ్యారు. ఈ భేటీలో బాలినేని మళ్లీ ఒంగోలులో బారీ బహిరంగ సభ ప్రస్తావన తీసుకువచ్చారు. ఆ సభకు పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారు. అందుకుపవన్ సానుకూలంగా స్పందించారని సమాచారం. ఒంగోలు వేదికగా బాలినేని భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ వేదికపై తన అనుచరులు పెద్ద ఎత్తున జనసేనలో చేర్చించాలని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఒంగోలులో భారీ బహిరంగ సభకు వస్తే.. ఇక ప్రకాశం జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోవడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే బాలినేనికి ఒక్క ఒంగోలు నియోజకవర్గంలోనే కాదు మొత్తం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గట్టి పట్టు ఉంది. వాస్తవానికి బాలినేని జనసేన గూటికి చేరిన సమయంలోనే ఆయన అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో జనసేన తీర్ధం పుచ్చుకోవాల్సి ఉంది. అప్పట్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో బాలినేని వారిని వారించారు. ఇక ఇప్పుడు అలా వారించే పరిస్థితి లేదు. ఆయనపై అనుచరుల ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ తో తన అనుచరుల చేరిక గురించి మాట్లాడారని, ఫిబ్రవరి 5న ఒంగోలులో భారీ బహిరంగ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో వారిని పార్టీలో చేర్చుకోవాలన్న బాలినేని ప్రతిపాదనకు పవన్ అంగీకరించినట్లు సమాచారం.
అదే జరిగితే ప్రకాశం జిల్లాలో వైసీపీ అడ్రస్ గల్లంతైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గిరి సహా వైసీపీ కార్పొరేటర్లంతా జనసేన గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నారనీ, అలాగే జిల్లా నలుమూలల నుంచీ కూడా పెద్ద సంఖ్యలో వైసీపీ క్యాడర్ జనసేన కండువా కప్పుకుంటారని అంటున్నారు. అంటే జనసేనాని ఒంగోలులో బాలినేని ఏర్పాటు చేసే సభకు రావడం అంటూ జరిగితే ప్రకాశం జిల్లాలో వైసీపీ గాయబ్ అయిపోవడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.