మన భారతదేశంపైకి కాలకేయులు ఎన్నిమార్లు దండెత్తారో తెలుసా?

బాహుబలి సినిమా ఫస్ట్ పార్ట్ లో అత్యంత ఉద్విగ్నంగా నడిచే ఎపిసోడ్ ఏది? సినిమా చివరికొస్తుంటే కనిపించే కాలకేయులతో యుద్ధం! ఎక్కడ్నుంచో వచ్చిపడతారు కాలకేయులు! వారి రూపం, హావభావం, సంస్కృతి, పద్ధతి… అన్నీ పరమ దుర్మార్గంగా వుంటాయి! ఇంకా చెప్పాలంటే… జుగుప్సాకరంగా, ఒళ్లు గగుర్పొడిచేలా వుంటాయి! అలాంటి వారు నాగరికులైన మాహిష్మతి ప్రజలపైన పడతారు. నీతీ, నియమం, సంస్కారం ఏమీ వుండవు. వారితో రణం అంటేనే ఓడిపోయినట్టుగా డీలా పడిపోతారు జనం! కాని, చివరకు బాహుబలి అందర్నీ ప్రేరేపించి కాలకేయుల అంతం చూస్తాడు. వారి రాజు తలతెగి పడేలా విజృంభిస్తాడు…

 

ఇంతకీ… ఈ కాలకేయుల లాంటి వారు ఎవరైనా మన పురాణాల్లో వున్నారా? రాజమౌళి వారి ప్రేరణ ఏమైనా పొందాడా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెప్పుకోవాలి! భాగవతంలో మనకు కాలకేయుల్లాగే కాలయవనులు కనిపిస్తారు. వీరు బహుశా హిమాలయలకు ఆవల వున్న గ్రీకు, ఇరాన్, పర్సియా లాంటి దేశాల నుంచి దండెత్తి వచ్చి వుంటారు. వారిని సమర్థంగా ఎదుర్కొన్న శ్రీకృష్ణుడు లక్షల మందిని హతమార్చి ద్వారకను రక్షిస్తాడు! బాహుబలిలో కూడా కాలకేయులు వేరే దేశం, ప్రాంతం నుంచి వచ్చిన వారే. అందుకే, వారు అనాగరికంగా ప్రవరిస్తారు.

 

భాగవత కాలంలోనో… బాహుబలి సినిమాలోనో కాదు… భారతదేశంపై యుగయుగాలుగా కాలకేయుల వంటి అనాగరిక జాతులు దండెత్తి వస్తూనే వున్నాయి. రామాయణ, భారత కాలాల్లో అలాంటి విదేశీ జాతుల్ని యవనులు అంటే… తరువాతి కాలంలో అలెగ్జాండర్ సేనలు అన్నారు. అలెగ్జాండర్ తరువాత కూడా డెమిత్రియస్ లాంటి యవన రాజుల్ని గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి భారతీయ రాజులు తరమికొట్టారు. ఇంకా తరువాతి కాలంలో దండెత్తి వచ్చిన కాలకేయులు… ప్రధానంగా… మధ్య ప్రాచ్యం నుంచి వచ్చిన ముస్లిమ్ రాజులు. మహ్మద్ గజినీ, మహ్మద్ ఘోరీ, బాబార్ లాంటి వారంతా ఈ కోవకే చెందుతారు. చివరగా మన దేశం మీదకొచ్చిన వేదేశీయులు … పోర్చుగీస్, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల వ్యాపారస్తులు. 1947 ఆగస్ట్ 15తో వీరి నుంచీ కూడా మనం బయటపడ్డాం. అంటే… దాదాపు వేయి సంవత్సరాలకు పైనే వివిధ రకాల కాలకేయుల దండయాత్రల్ని ఎదురొడ్డి నిలిచి … గెలిచింది భారతదేశమన్నమాట!

 

బాహుబలి సినిమా తెరపై మాహ్మిష్మతి అయినా… ప్రపంచ పటంపై అఖండ భారతావని అయినా… కాలకేయుల కర్కోటకత్వానికి ఎందుకు బలవ్వాల్సి వచ్చింది? సంస్కృతితో, సంస్కారంతో, సంపదతో సమృద్ధిగా వుండటం వల్లే! ఈ రోజు దేశదేశాల్లో ధగధగలాడుతోన్న ఎన్నో వజ్రాలు, విజ్ఞానాలు మన దేశం నుంచి తరలిపోయినవే! కోహినూర్ వాటిల్లో ఒకానొకటి మాత్రమే!