బాబు అరెస్టు ఎఫెక్ట్.. జగన్ కు మోడీ, షా నో అప్పాయింట్ మెంట్

తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేయడంపై కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు సీరియస్ అయ్యారా? ఆ క్రమంలోనే ఏపీ సీఎం జగన్‌కి మోడీ, అమిత్ షాలు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదా? అంటే అవుననే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  చంద్రబాబు అరెస్ట్‌పై కేంద్రం  పెద్దలు ఇప్పటి వరకు స్పందించకున్నా.. తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు మాత్రం  చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించడమే కాకుండా.. జగన్ ప్రభుత్వ వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమర్శలు గుప్పిస్తున్నారు.  

మరోవైపు సీఎం జగన్ లండన్ పర్యటనలో ఉండగా.. చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు నంద్యాలలో అరెస్ట్ చేశారు.   సీఎం జగన్... తన విదేశీ పర్యటన పూర్తి చేసుకొని.. స్వదేశానికి వచ్చిన వెంటనే.. అంటే ఆ మరునాడే ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారని.. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో, హోం మంత్రి అమిత్ షాతో సీఎం  జగన్ భేటీ కానున్నారని.. ఈ భేటీలో చంద్రబాబు అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది... దాని వెనుక ఉన్న కారణాలు.. ఢిల్లీ పెద్దలకు ఆయన వివరించనున్నారని.. పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.   

కానీ జగన్ లండన్ నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకొని దగ్గరదగ్గర పక్షం రోజులు గడుస్తున్నా.. ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లింది   లేదు. ఎందుకు వెళ్లలేదంటే.. సీఎం జగన్‌కు మోడీ, అమిత్ షా ద్వయం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని అంటున్నారు. మరో వైపు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైనాయి.  అలాంటి వేళ.. ప్రదాని, హోం   మంత్రి క్షణం తీరిక లేకుండా ఉన్నారని.. అందుకే జగన్ ఢిల్లీ వెళ్లలేదనీ వైసీపీ శ్రేణులే చెప్పుకుంటున్నాయి. 

మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌పై కేంద్రంలోని పెద్దలకు ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదికలు అందాయని.. దీంతో వారు సైలెంట్ అయి.. చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించాలంటూ తెలుగు రాష్ట్రాల్లోని కమలం పార్టీ పెద్దలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయని.. దాంతో ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ పెద్దలు చంద్రబాబు అరెస్ట్ అంశంపై స్పందించారనే చర్చ సైతం కొనసాగుతోంది. 

అదీకాక.. చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత.. సీఎం   జగన్‌కు కేంద్రంలోని పెద్దలు అపాయింట్‌మెంట్ ఇస్తే.. అందుకు సంబంధించి తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు.. సైలెంట్ అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదీకాక ఎన్నికలు సమీపిస్తున్నాయి... ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆచి తూచి స్పందించాలని లేకుంటే అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఉందన్న భావనలో   బీజేపీ అధినాయకత్వం ఉందని అంటున్నారు.  

ఇక ఇప్పటికే రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి వెళ్తామంటూ ఏపీ బీజేపీ పెద్దలు క్లియర్ కట్‌గా ప్రకటించారు. కానీ చంద్రబాబు అరెస్ట్‌ కావడం.. ఆయనను రిమాండ్‌లో భాగంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించడం... ఆ క్రమంలో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ములాఖత్ కావడం.. అనంతరం బయటకు వచ్చిన పవన్ కల్యాణ్‌.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి జనసేన వెళ్తుందంటూ స్పష్టమైన ప్రకటన చేయడంతో.. బీజేపీ పరిస్థితి డోలాయామానంలో పడినట్లు అయిందని.. ఇటువంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో బీజేపీ వ్యూహాం ఎలా ఉండబోతుందనే ఓ చర్చ   పోలిటికల్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది.