అవినాష్ ముందస్తు.. అంతిమ తీర్పుపై ఉత్కంఠ?

మరి కొన్ని గంటలలో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందా అంటే న్యాయనిపుణులు ఔననే అంటున్నారు. ఏపీ సీఎం జగన్ స్వంత బాబాయ్ వైఎస్ వివేకానాందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ ను అరెస్టు చేసి విచారించాలని సీబీఐ కోర్టుకు స్పష్టం చేసిన నేపథ్యంలో  అవినాష్ కు ముందస్తు బెయిలు లభించే అవకాశాలు దాదాపు శూన్యమేనని అంటున్నాయి.

అయితే గత శనివారం (మే 27) తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్ ముందస్తు బెయిలు పిటీషన్ పై వాదనలు విన్న అనంతరం తీర్పును బుధవారం(మే31)కు వాయిదా వేసింది. అంతకు ముందు వరుసగా రెండు రోజుల పాటు అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ పై అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు, డాక్టర్ సునీత తరఫు న్యాయవాదులు, సీబీఐ తరఫు న్యాయవాదులు సుదీర్ఘవాదనలు వినిపించాయి. ఆ తరువాత హైకోర్టు వేకేషన్ బెంచ్ తీర్పు బుధవారం(మే 31)కి వాయిదా వేసింది. 31వరకూ అవినాష్ ను అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించింది. ఈ సందర్భంగా కోర్టు సీబీఐ దర్యాప్తు తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని వ్యాఖ్యానించింది.

అవినాష్ కు అరెస్టు కాకుండా ఎటువంటి రక్షణా లేకున్నా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది? అవినాష్ ఫోన్ ను ఇంత వరకూ ఎందుకు స్వాధీనం చేసుకోలేదని నిలదీసింది. కాగా అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ పై వాదనలు క్లోజ్ గా ఫాలో అయిన న్యాయ నిపుణులు ఆయనకు యాంటిసిపేటరీ బెయిలు లభించే అవకాశాలు దాదాపు శూన్యమని చెబుతున్నాయి. 

అసలు మొదటి నుంచీ సీబీఐ వర్సెస్ అవినాష్ టామ్ అండ్ జెర్రీని తలపించేలాగే సాగింది. సీబీఐ విచారణకు పిలిచినప్పుడల్లా ఏవేవో కారణాలు చెప్పి వాయిదాలు తీసుకుంటారు. ఇక హాజరు కాక తప్పదన్న పరిస్థితి వస్తే కోర్టులను ఆశ్రయిస్తారు. గత జనవరి నుంచీ ఈ గేమ్ ఇలా సాగుతూనే ఉంది. ఇక చివరి అంకానికి వచ్చేసింది. అవినాష్ ముందస్తు బెయిలుపై తెలంగాణ హై కోర్టు వెకేషన్ బెంచ్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు బుధవారం (మే 31) తెరపడుతుంది.