ఏపీలోకి షర్మిల ఎంట్రీ?.. జగన్ కు ఇక చుక్కలే?

తెలంగాణలో వైఎస్సార్టీపీ పేరిట సొంత పార్టీ పెట్టుకున్న వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల ఎవరు వదిలిన బాణమంటూ అనేక ప్రశ్నలు తలెత్తాయి. వాటన్నిటినీ దాటుకుని ఆమె చాలా దూరం నడిచేశారు. అయినా ఆమె రాజకీయ లక్ష్యం ఏమిటి? ఆమె టార్గెట్ ఎవరు అన్న విషయంలో ఇంత కాలం స్పష్టత రాలేదు. అయితే ఇటీవల స్వల్ప వ్యవధిలో ఆమె కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో రెండు సార్లు భేటీ అయిన తరువాత ఆమె అడుగులు ఎటు? ఆమె టార్గెట్ ఎవరు అన్న విషయంలో మెల్లిమెల్లిగా ఒక క్లారిటీ వస్తోంది. 

ఇప్పటి వరకూ తెలంగాణలో అధికార బీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత, ఆయన కుటుంబ సభ్యులూ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తూ జాతీయ స్థాయి రాజకీయ పార్టీలను ఆకర్షించిన షర్మిల తన అసలు టార్గెట్ మాత్రం సొంత సోదరుడు, ఏపీ సీఎం జగన్ రెడ్డే అన్న విషయాన్ని డీకేతో భేటీ సందర్భంగా ఆయనకు తేటతెల్లం చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో పార్టీని నడపడానికి అవసరమైన వనరుల సమీకరణలో ఆమెకు సోదరుడు జగన్ అడుగడుగునా అవరోధాలు సృష్టిస్తున్నారన్నది ఆమె ఆగ్రహంగా చెబుతున్నారు.  ఇక షర్మిల అవసరాన్ని ఆసరాగా చేసుకుని డీకే శివకుమార్ కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించి షర్మిల కాంగ్రెస్ లో చేరే విధంగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. అసలు విషయమేమిటంటే.. డీకే ప్రతిపాదనకు షర్మిల ఇప్పటి వరకూ ఔనని కానీ.. కాదని కానీ బదులివ్వలేదని అంటున్నారు.

ఆమె ఇంత కాలం తన కార్యక్షేత్రం  తెలంగాణ అని భావించి అక్కడ పని చేసి  కొంత వరకూ సక్సెస్ అయ్యారు. ఆమెను బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్టు చేసిన సమయంలో స్వయంగా కేంద్ర హోంమంత్రి ఫోన్ చేసి పరామర్శించారు.  అయితే తెలంగాణలో పార్టీ  నడిపేందుకు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ అండతో ఏపీలో కూడా కాలుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే తెలంగాణ పార్టీని ఏపీలో విస్తరించే అవకాశం లేనందున ఆమె తన వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. అదే  జరిగితే.. వైఎస్ జీవించి ఉన్నంత కాలం అంటిపెట్టుకుని ఉన్న పార్టీలోకి ఆయన వారసురాలిగా ఆమె అడుగుపెట్టినట్లౌతుంది. అదీ గాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డికి రెండు ప్రాంతాలలోనూ అంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో   అపార ప్రజాభిమానం ఉంది. ఇక ఏపీలో జగన్ విషయానికి వస్తే తండ్రి  మరణం తరువాత కాంగ్రెస్ తో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నా  కుటుంబం మొత్తం  ఆయన వెన్నంటి నిలిచి  వైఎస్ రాజకీయ వారసుడు జగనే అని చాటారు.

అయితే అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఆయన తీరుతో కుటుంబం మొత్తం ఆయనకు దూరమైంది. మరీ ముఖ్యంగా సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో జగన్ వ్యవహరించిన తీరు, ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి వత్తాసుగా  వివేకా కుమార్తెను ఇబ్బందులకు గురిచేసిన సంఘటనలతో  కుటుంబం జగన్ కు దూరమైంది. చివరకు సొంత తల్లి, చెల్లి కూడా ఆయనకు దూరం జరిగారు. అదే సమయంలో వివేకా హత్య కేసు దర్యాప్తు తీరుపై డాక్టర్ సునీత చేసిన, చేస్తున్న న్యాయపోరాటానికి షర్మిల మద్దతుగా నిలవడంతో వైఎస్ కుటుంబం  షర్మిల వెనుక  నిలవడంతో జగన్ ఒంటరి అయ్యారు.

ఈ నేపథ్యంలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆమె ఏపీ రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరిస్తే వ్యక్తిగతంగానే కాకుండా రాజకీయంగా కూడా జగన్ గడ్డు పరిస్థితి ఎదుర్కొనక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే  ముఖ్యమంత్రిగా ఉండి కూడా సొంత బాబాయ్ హత్య కేసు దర్యాప్తునకే అడుగడుగునా అడ్డుపడుతూ,  ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలవడం, తాజాగా ఈ కేసులో  సీబీఐ జగన్ పేరును కూడా ప్రస్తావించడంతో  ఆయన ప్రతిష్ట మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో బాబాయ్ హత్య కేసులో న్యాయం కోసం నిలబడిన వివేకా కుమార్తె సునీతకు అండగా నిలిచిన షర్మిల కనుక ఏపీ రాజకీయాలలో ప్రవేశిస్తే జగన్ కు రాజకీయంగా పూడ్చుకోలేని నష్టం వాటిల్లడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఆస్తుల వ్యవహారంలోనే కాకుండా, రాజకీయంగా కూడా తనకు అడుగడుగునా అవరోధాలు కల్పించిన సోదరుడు జగన్ పై ఆగ్రహంతో ఉన్న షర్మిల కాంగ్రెస్ ఆఫర్ ను అంగీకరించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు.   పార్టీని   విలీనం చేయడానికి అంగీకరిస్తే.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు షర్మిలకు అప్పగించేందుకు కాంగ్రెస్ హై కమాండ్ ఇప్పటికే సూత్ర ప్రాయంగా అంగీకరించిందని కూడా చెబుతున్నారు. అదే జరిగితే ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ కు, జగన్ సర్కార్ కు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న బీజేపీకీ ఒకే సారి చెక్ పెట్టినట్లు అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.

షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే అటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ బలోపేతమౌతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద షర్మిల స్వల్ప వ్యవధిలో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ ల  వెనుక కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఉన్నారనీ, ఆమె సూచన మేరకే షర్మిలను కాంగ్రెస్ లోకి డీకే ఆహ్వానించారనీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.