ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత జకోవిచ్

నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్-2023 టైటిల్ విజేతగా నిలిచాడు. జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకోవడం ఇది పదోసారి కావడం విశేషం. ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్‌లో గ్రీస్‌కు చెందిన మూడో సీడ్ స్టెఫనోస్ సిట్సిపస్‌పై  6-3, 7-6, 7-6 తేడాతో జకోవిచ్ విజయం సాధించాడు.24 ఏళ్ల స్టెఫనోస్ త్సిత్సిపాస్‌ గట్టిగా పోరాడినప్పటికీ  జకోవిచ్ ముందు నిలువలేకపోయాడు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను ఏకంగా 10వసారి జకోవిచ్ సొంతం చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా జకోవిచ్ నిలిచాడు.

ఈ టైటిల్ గెలవడం ద్వారా జకోవిచ్..   అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన ఆటగాడిగా రఫెల్ నాదల్ పేరుతో ఉన్న రికార్డును సమం చేశాడు. రఫెల్ నాదల్ అత్యధికంగా 22 టైటిల్స్ గెలవగా, జకోవిచ్ కూడా ఈ టైటిల్ విజయంతో 22 టైటిల్స్ గెలిచినట్లైంది. అంతే కాకుండా జకోవిచ్ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును సైతం కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకోవిచ్ వరుసగా 28 మ్యాచ్‌లు గెలుపొందడం మరో విశేషం. ఈ ఫైనల్ మ్యాచ్‌లో మూడు సెట్లలోనూ జకోవిచ్ ఆధిపత్యం ప్రదర్శించాడు. వరుస సెట్లు గెలుచుకుంటూ దూసుకెళ్లాడు.

గతంలో కూడా జకోవిచ్ సిట్సిపస్‌పై ఎక్కువ విజయాలు సాధించాడు. జకోవిచ్-సిట్సిపస్ మధ్య విజయాల సంఖ్య 11-2గా ఉంది. చివరిగా వీరిరువురూ 2021 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడ్డారు. అప్పుడూ విజయం సాధించినది జకోవిచ్.  ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్స్‌కు అత్యధిక సార్లు గెలుచుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.  

జకోవిచ్ 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021, 2023 టైటిల్స్ సాధించాడు. మెన్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌కు సంబంధించి రఫెల్ నాదల్, జకోవిచ్   22 టైటిల్స్ తో సమంగా ఉన్నారు. వీరి తరువాత తర్వాత రోజర్ ఫెదరర్ 20 టైటిల్స్, పీట్ సంప్రాస్ 14 టైటిల్స్ తో రెండు మూడు స్థానాలలో ఉన్నారు.