రాజధాని తరలింపు ఎఫెక్ట్... 210 కోట్ల నష్ట పరిహారం కోరుతూ సినీ ప్రముఖులు హైకోర్టులో పిటిషన్ 

ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత రాజధానిని అమరావతి నుండి విశాఖకు మార్చాలని నిర్ణయయించిన సంగతి తెలిసిందే. దీంతో రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ 286 రోజులుగా రాజధాని ప్రాంతంలో రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం అప్పట్లో టీడీపీ ప్రభుత్వం రైతుల నుండి భూసమీకరణ చేసింది. అయితే ఇక్కడి భూమికి బదులుగా రాజధాని అమరావతిలో భూములు ఇస్తామని అప్పటి ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. ఎప్పుడైతే రాజధాని తరలింపు వార్త వచ్చిందో అప్పటి నుండి గన్నవరంలో భూములిచ్చిన రైతులు ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులను వ్యతిరేకిస్తూ తమ భూములలో వ్యవసాయ పనులు చేపట్టిన సంగతి కూడా తెలిసిందే.

 

తాజాగా గన్నవరంలో ఉన్న తమ భూములకు తగిన నష్ట పరిహారం ఇప్పించాలని ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్, సీనియర్ నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం 40 ఎకరాల భూమిని అశ్వినీదత్ ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే ప్రభుత్వ ఒప్పందం ప్రకారం భూసేకరణ కాకుండా.. భూ సమీకరణ కింద అశ్వినీదత్ భూమిని ఇచ్చారు. అశ్వినీదత్ భూసమీకరణ కింద ఇచ్చిన భూమికి బదులుగా సీఆర్డీయే పరిధిలో ఆయనకు గత ప్రభుత్వం భూమిని కేటాయించింది. అయితే ఏపీ ప్రభుత్వం రాజధానిని తరలిస్తుండడంతో.. ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ అశ్వినీదత్ హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా గన్నవరం విమానాశ్రయ విస్తరణ పనులను కూడా ఆపేయాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

 

గన్నవరంలో తాను ఇచ్చిన భూమిని తనకు తిరిగి ఇవ్వాలని.. అలా సాధ్యం కాని పక్షంలో భూసేకరణ కింద నాలుగు రెట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. తాను ఇచ్చిన 39 ఎకరాల భూమికి రూ.210 కోట్లు చెల్లించి తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఎయిర్‌పోర్టు అథారిటీని ప్రతివాదులుగా చేరుస్తూ అశ్వినీదత్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ప్రస్తుతం తాను ఇచ్చిన 39 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌ వాల్యూ ఎకరం రూ.కోటి 84 లక్షలకు చేరుకుందన్నారు. భూ సేకరణ కింద ఈ భూమికి 4 రెట్లు చెల్లించి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా లేదా ఏపీ ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టుకోవచ్చని అశ్వినీదత్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అశ్వినీదత్‌ తరపున హైకోర్టులో ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ పిటిషన్‌ వేశారు.

 

ఇది ఇలా ఉండగా సీనియర్ నటుడు కృష్ణంరాజు కూడా తాజాగా గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణలో తమకు చెందిన 31 ఎకరాల భూమికి సరైన నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టును కోరారు. తమ పొలంలో ఉన్న పంటలు, నిర్మాణాల విలువను పరిగణనలోకి తీసుకుని నష్ట పరిహారం చెల్లించాలని అయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. కృష్ణంరాజు పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు... ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.