కడపలో దూసుకుపోతున్న మాధవీ రెడ్డి.. డిప్యూటీ సీఎంకు షాక్ తప్పదా?

కడప అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం దూసుకెడుతోంది.  ఆ పార్టీ అభ్యర్థి మాధవీరెడ్డి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వైసీపీ కంచుకోట బీటలు వారిందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా తెలుగుదేశం జోరు కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ కడప అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు ప్రజా నిరసన సెగ తగులుతోంది.

ఈ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించిన ఆయన హ్యాట్రిక్ సాధించే అవకాశాలు అంతంత మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కడప వైసీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గమే అయినా.. గత ఐదేళ్ల వైసీపీ పాలన పట్ల ప్రజలలో వ్యక్తమౌతున్న ఆగ్రహం, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేగా అంజాద్ పాష పని తీరు పట్ల అసంతృప్తి ఎన్నికల సమయంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయంటున్నారు. 

దానికి తోడు అంజాద్ పాషాకు ప్రజా వ్యతిరేకత ఒక్కటే కాకుండా పార్టీలో వర్గపోరు కూడా ఇబ్బంది పెడుతోంది.  ముఖ్యంగా కడప కార్పొరేటర్లు ఈ సారి వైసీపీకి దూరం జరిగిన పరిస్థితులు ఉన్నాయి. 
వైఎస్ఆర్ పై అభిమానంతో వైసీపీకి గత ఎన్నికలలో మద్దతుగా నిలిచిన కార్పొరేటర్లలో చాలా మంది ఇతర పార్టీలకు మరీ ముఖ్యంగా తెలుగుదేశంకు వలస వెళ్లిపోయిన పరిస్థితి.  తొలి నుంచీ కాంగ్రెస్ కు పెట్టని కోటగా ఉన్న కడప అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్ మరణం తరువాత వైసీపీకి కంచుకోటగా మారింది.   

అయితే ఈ సారి ఆ పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశంం అభ్యర్థిగా బరిలో నిలిచిన రెడ్డప్పగారి మాధవీరెడ్డి నాయకత్వ పటిమ, ప్రచార వ్యూహాలతో కడపలో రాజకీయ ముఖచిత్రం దాదాపుగా మారిపోయిందంటున్నారు. ఆమె ప్రచార శైలి, మాట తీరుతో నియోజకవర్గంలో మంచి గుర్తింపు సాధించారనీ, మరీ ముఖ్యంగా మైనారిటీలు, మహిళల్లో ఆమె పట్ల ఆదరణ ప్రస్ఫుటంగా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.    మాధవీరెడ్డి ప్రచారశైలి, వ్యక్తం చేస్తున్న ఆత్మవిశ్వాసం పట్ల తెలుగుదేశం హైకమాండ్ కూడా సంతోషంగా ఉంది. మాధవీలత ధైర్యాన్నీ, కడపలో వైసీపీ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్న తీరునూ ప్రశంసిస్తోంది.