చైనా నుండి మరో కొత్త ప్రమాదకర వైరస్.. ఇప్పటికే ఇండియాలోకి ఎంట్రీ ..

చైనాలో పుట్టిన కరోనా వైరస్ గత 9 నెలలుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటివరకు ఈ వైరస్ కు సరైన మందు కానీ.. వ్యాక్సిన్ కానీ రాలేదు. ఇది ఇలాఉండగా తాజాగా చైనా నుండి మరో ప్రమాదకర వైరస్ వ్యాప్తి మొదలైంది. తాజాగా చైనా నుంచి మరో ప్రమాదకర వైరస్ భారత్ లో వ్యాపించే ప్రమాదం ఉందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్ (ఐసీఎంఆర్) హెచ్చ‌రించింది. చైనాలో మొదలైన "క్యాట్ క్యూ వైరస్" (సీక్యూవీ) తాజాగా మన దేశంలో దాడికి సిద్ధంగా ఉందని ఐసీఎంఆర్ పేర్కొంది. క్యూలెక్స్ జాతి దోమలు, పందులను ఈ వైరస్ వాహకాలుగా మార్చుకుంటుందని చైనా, తైవాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో ఇప్పటికే వెల్లడైంది. భారత్‌లో కూడా పందుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఐసీఎంఆర్ పేర్కొంది. ఏజిప్టీతోపాటు క్యూలెక్స్ జాతి దోమల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందని తాజా ప్రకటనలో తెలిపింది. ఇప్ప‌టికే ఈ క్యాట్ క్యూ వైరస్ చైనా, వియత్నాంలలో వేగంగా వ్యాప్తిస్తున్న‌ట్టుగా వార్తలో వస్తున్నాయి .

 

ఐసీఎంఆర్‌, పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ కలిసి ఇటీవ‌ల దేశ‌వ్యాప్తంగా 883 సీరమ్‌ నమూనాలు సేకరించారు. అయితే ఇందులో ఇద్దరు వ్య‌క్తుల‌కు సంబంధించిన న‌మూనాల్లో సీక్యూవీ వైరస్‌ను ఎదిరించే యాంటీబాడీలు క‌నిపించ‌డం తీవ్ర ఆందోళ‌న‌కు గురిచేసింది. కర్ణాటకకు చెందిన ఆ బాధితుల్లో ఇప్ప‌టికే ఈ వైర‌స్ వచ్చి తగ్గిపోయినట్టు ఐసీఎంఆర్ నిర్ధారించింది. దీంతో సీక్యూవీ వైరస్‌ను గుర్తించే టెస్టును కూడా ఐసీఎంఆర్ తాజాగా అభివృద్ధి చేసింది.