వైసీపీ ఎమ్మెల్యేకి నాన్ బెయిలబుల్ వారెంట్
posted on Jul 6, 2019 10:16AM

ఒకపక్క ఏపీ సీఎం జగన్ అవినీతి అనేదే లేకుండా చేస్తానని చెబుతూ అందుకోసం ఏవేవో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ మరోపక్క ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఆయన పరువు తీస్తున్నారు, తాజాగా ఆయన పార్టీ ఎమ్మెల్యేకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే వైసీపీకి చెందిన చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్ బాబుకు షాక్ ఇస్తూ చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చెక్ కేసు విచారణలో భాగంగా ఎమ్మెల్యే కోర్టు వాయిదాలకు చాలా మార్లు హాజరుకానందున ఒంగోలు సంచార న్యాయ స్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
ఎమ్మెల్యే బాబుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఎమ్మెల్యే కాక మునుపు ఒంగోలుకు చెందిన తిప్పారెడ్డి మోహన్‌రెడ్డి వద్ద 2009 ఆగస్టు 4న రూ.8లక్షలు, నవంబరు 5న రూ.9లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఆ బాకీ తిరిగి చెల్లించేందుకు 2010 ఫిబ్రవరి 4న రూ.19లక్షలకు గానూ 6 చెక్కులు ఇచ్చారు. ఆ చెక్కులు బ్యాంకులో వేయగా నిధులు లేని కారణంగా అవి బౌన్స్ అయ్యాయి. ఆయనను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో మోహన్ రెడ్డి కోర్టులో ఫిర్యాదు చేశారు.. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఎమ్మెల్యేని కోర్టుకు రావాలని కోరింది. ఎన్ని సార్లు పిలిచినా బాబు విచారణకు గైర్హాజరవుతుండటంతో సీరియస్ గా తీసుకున్న కోర్టు ఇంతకు మునుపే నాన్‌బెయిలబుల్ వారెంటు జారీ చేయగా 2019 ఎన్నికలకు ముందు రీకాల్ చేసుకున్నారు. అప్పటి నుంచి మరలా కోర్టుకు హాజరు కాకపోవడంతో శుక్రవారం నాన్‌బెయిలబుల్ వారెంటు జారీ చేశారు.