అపాయింటెడ్ డేపై స్టేకి హైకోర్టు నో!
posted on Jun 1, 2014 2:45PM
.jpg)
ఆదివారం సమైక్య ఆంధ్రప్రదేశ్‌కి చివరి రోజు. ఆదివారం అర్ధరాత్రి దాటి సోమవారం ప్రవేశించగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోనుంది. తెలంగాణ బిల్లులో పొందుపరిచిన అపాయింటెడ్ డే అనుసరించి జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రం రెండు ముక్కలు కాబోతోంది. అయితే రాష్ట్ర విభజనను ఆపడానికి తమ శాయశక్తులా కృషి చేస్తున్న కొందరు సమైక్యవాదులు పట్టువదలని విక్రమార్కుల్లా తమవంతు ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. అయితే అవి ఫలితాన్ని ఇవ్వడంలేదు. రాష్ట్రాలను రెండుగా విభజించే అపాయింటెడ్ డేకి స్టే విధించాలని సంజీవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో దాఖలుచేసిన హౌస్ మోషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్డులో పెండింగ్‌లో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని, అపాయింటెడ్ డే పై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను అయిదు వారాలకు వాయిదా వేసింది. దీంతో రాష్ట్ర విభజనకు ముందు రోజు కూడా సమైక్యవాదులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారికి మరోసారి నిరాశే మిగిలింది.